Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర విశేషాలు... పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?

ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర విశేషాలు... పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?
, సోమవారం, 27 జులై 2015 (21:34 IST)
భారతదేశంలో ఉన్న అతికొద్దిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఈయన పూర్తి పేరు.. డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలామ్. ఈయన 1931, అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్. ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958లో మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. 
 
పట్టభద్రుడైన తర్వాత ఆయన భారతదేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ)లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది. 
 
1982లో, ఆయన డీఆర్డీవో డైరక్టరుగా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిస్సైల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంటే దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనకు "మిస్సైల్ మాన్" అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత జూలై 1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. అబ్దుల్ కలాం కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడంజరిగింది. ఈ అణు పరీక్షతో భారతదేశాన్ని అణ్వస్త్రరాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 
 
ఈయనకు భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ భూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990), భారతరత్న (1997)లు వరించాయి. అలాగే, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30వరకు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2002 జూలై 18వ తేదీన భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాగా, జూలై 25న రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టారు. ఈయనకు నాటి ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో 90 శాతానికి పైగా ఓట్ల మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అబ్దుల్ కలాంపై వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్ పోటీ చేశారు. 
 
అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీత‌ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్‌ వంటి అనేక పుస్తకాలను రచించారు.

Share this Story:

Follow Webdunia telugu