Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లా వైకాపా నేతలకేమైంది... ప్రజల కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యమా!?

చిత్తూరు జిల్లా వైకాపా నేతలకేమైంది... ప్రజల కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యమా!?
, మంగళవారం, 4 ఆగస్టు 2015 (10:00 IST)
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పట్టుకొమ్మలాంటి జిల్లా చిత్తూరు జిల్లా. గత ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాలోనే వైకాపా జెండా బాగా రెపరెపలాడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న మూడు ఎంపీ సీట్లకు గాను రెండు చోట్ల, 14 అసెంబ్లీ సీట్లకు గాను 8 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించి తమ పట్టును నిరూపించుకున్నారు. ఈ జిల్లాలో వైకాపా బలం కారణంగా టీడీపీ సీనియర్ నేతలు సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇంతవరకుబాగానే ఉంది. కానీ, ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం వైకాపా నేతలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
 
 
నిజానికి గత కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లా రైతులను, ప్రజలను అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కరవు తాండవం చేస్తోంది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ గత రెండేళ్లుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరలేదు. చెరుకురైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ సమస్యలపై రైతులు పోరాడుతున్నా ప్రధాన ప్రతిపక్షం హోదాలో వైకాపా నేతలు వారికి సంఘీభావం ప్రకటించండలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. 
 
అలాగే, జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌లలో ఒకటైన మదనపల్లిలో డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే తిప్పారెడ్డి కనీసం ఆస్పత్రిని కూడా సందర్శించిన పాపాన పోలేదు. అలాగే, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో రైతులు వాతావరణం అనుకూలించక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలు నోరు విప్పడం లేదనే విమర్శలొస్తున్నాయి. 
 
తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఓటమి తర్వాత ప్రవీణ్ కూమార్ రెడ్డి నియోజకవర్గం వైపు ముఖం చూపించడం కూడా మానేశారు. నియోజకవర్గంలో ఏర్పడిన కరవు పరిస్థితుల కారణంగా అనేక గ్రామాల ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరి నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రజా సమస్యల కంటే పబ్లిసిటీపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనే విమర్శలున్నాయి. ఈ జిల్లాలో ఉన్న వైకాపా నేతల్లో మీడియాలో అధికంగా కనిపించే నేత ఈయనే కావడంతో ఈ ప్రచారం సాగుతోంది. 
 
నగరిలో తాగునీరు కలుషితమవడంపై జనం రోడ్డెక్కుతున్నా... స్థానిక ఎమ్మెల్యే రోజా స్పందన కరువైంది. ఈమె టీవీ షోలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యలపై ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అడపదడపా కనిపిస్తున్నారు. అధికారులు ఆయన మాట వినడం లేదు. పింఛన్ల కోసం ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ రెండు రోజలు నిరహార దీక్ష చేయాల్సి వచ్చింది. తిరుపతిలో మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి అడపదడపా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను నియోజకవర్గంలోనే ఉన్నానని గుర్తు చేస్తున్నారు. 
 
ఇకపోతే.. కుప్పం, శ్రీకాళహస్తి, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో వైకాపా ఓడిపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గాలకు కొందరు నేతలను ఇంఛార్జ్‌లుగా నియమించారు. కానీ, వీరు ప్రజల సంగతి దేవుడెరుగ.. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటంలేదు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ జిల్లా కన్వీనర్‌ నారాయణస్వామి ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదన్న టాక్‌ నడుస్తోంది. మొత్తంమీద జిల్లాలో ప్రతిపక్షం ఉందా లేదా అన్న అనుమానాలొచ్చేలా వైకాపా నేతల తీరు ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని అస్త్రాలున్నా వైసీపీ సద్వినియోగం చేసుకోలేకపోతుందన్న చర్చ జోరుగానే సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu