Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో పులి... తిరుమలలో ఖాళీ అవుతున్న మఠాలు

తిరుమలలో గత వారంరోజులుగా చిరుత పులులు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా భక్తులకు కనిపించి వెంటనే మాయమైపోతున్నాయి.

వామ్మో పులి... తిరుమలలో ఖాళీ అవుతున్న మఠాలు
, బుధవారం, 15 జూన్ 2016 (11:38 IST)
తిరుమలలో గత వారంరోజులుగా చిరుత పులులు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా భక్తులకు కనిపించి వెంటనే మాయమైపోతున్నాయి. చిరుత పులుల సంచారంతో భక్తులు తిరుమలకు రావాలంటేనే భయపడి పోతున్నారు. అంతేకాదు మఠాలకు వెళ్ళాలంటే గజగజా వణికిపోతున్నారు. తిరుమల గిరులలో చిరుతల సంచారంపై ప్రత్యేక కథనం..
 
వన్యప్రాణులను సంరక్షించడంటూ తితిదే మాత్రం తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే రహదారితో పాటు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే రహదారులలో పెద్ద పెద్ద బోర్డులను ఏర్పాటుచేసింది. అయితే ఆ వన్యప్రాణులను కాపాడమేమో గానీ భక్తుల ప్రాణాలను కాపాడటమే తితిదేకి పెద్ద సవాల్‌గా ప్రస్తుతం మారుతోంది. కారణం చిరుత పులులు. 
 
తిరుమల గిరులలో 12 చిరుత పులులు ఉన్నట్లు ఇప్పటికే అటవీశాఖ అధికారులు గుర్తించారు. తిరుమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయి. ప్రధానంగా వేసవి కాలంలో మాత్రమే పులులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. కారణం అటవీ ప్రాంతంలో నీరు ఎండిపోవడమే. దాహానికి తట్టుకోలేక చిరుతలు జనజీవనంలోకి వచ్చేస్తున్నాయి.
 
ఇదే పరిస్థితి తిరుమలలో ఎన్నోసార్లు ఎదురైంది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో గత సంవత్సరం కూడా ఎన్నోసార్లు చిరుతపులులు కనిపించాయి. ఒక చిరుత పులినైనే అటవీశాఖ అధికారులు పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు. అయితే ప్రస్తుతం మాత్రం మూడు చిరుతపులులు తిరుమల గిరులలోనే తిరుగుతూ ఉన్నాయి. అది కూడా భక్తులు సంచరించే ప్రాంతంలోనే. గత నాలుగురోజులకు ముందు హంపి మఠంలోకి వచ్చిన చిరుత పులి 20 నిమిషాలకుపైగా అక్కడే తిరిగింది. అర్థరాత్రిమయం కావడంతో ఎవరూ అటువైపు వెళ్లలేదు. ఒక మఠానికి చెందిన ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడానికి వెళితే చిరుత కనిపించింది.
 
ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ వ్యక్తి అరుచుకుంటూ మఠంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. విషయం కాస్త ఒక్కొక్కరుగా అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది ఉదయానికల్లా మఠంలోని గదులన్నీ ఖాళీ అయిపోయాయి. భక్తులతో నిండిపోయి ఉన్న మఠం గదులు కాస్త ఖాళీ కావడానికి చిరుత కారణమే. ఒక హంపి మఠమే కాదు అన్ని మఠాల పరిస్థితి అదే. హంపి మఠానికి పక్కనే ఉన్న మఠాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి.
 
మఠాలన్నీ పాపావినాశనం మార్గంలోని గోగర్భ డ్యాంకు అతి సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతం ఒక రకంగా దట్టమైన అటవీ ప్రాంతమే. దీంతో చిరుత పులులు ఇక్కడికి వచ్చేస్తున్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇది ఒకటే కాదు రెండురోజులకు ముందు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లేందుకు కొత్త రహదారిని తితిదే ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలోనే చిరుత కనిపించింది. రాత్రి 7 గంటల సమయంలో దర్జాగా రోడ్డుపైనే పడుకుంది చిరుత. పది నిమిషాలకుపైగా అది అక్కడే ఉంది. దీంతో వాహనాలను నిలిపేశారు తితిదే అధికారులు. అటవీశాఖాధికారులు వచ్చే లోపే చిరుత వెళ్లిపోయింది.
 
చిరుత హల్‌చల్‌తో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తితిదే మాత్రం చిరుత పులులను పట్టుకోకుండా అవి ఏం చేయవంటూ చెప్పుకొచ్చే మాటలు చెబుతుంటే భక్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. చిరుత పులులను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేయాల్సింది పోయి ఏం చేయవంటూ చెప్పడం నిజంగానే విడ్డూరంగా ఉంది. చిరుత పులుల సంచారంపై తితిదే ఉన్నతాధికారులు స్పందించకుంటే భారీ మూల్యమే చెల్లించక తప్పదని పలువురు చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో ఖాళీకానున్న వైకాపా... 18న అమరనాథ్ రెడ్డి టీడీపీలో చేరిక