Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడపలో యువనేత జగన్ వైకాపాకి షాక్... భాజపా-తెదెపా నమిలేస్తాయా...?!!

కడపలో యువనేత జగన్ వైకాపాకి షాక్... భాజపా-తెదెపా నమిలేస్తాయా...?!!
, సోమవారం, 19 జనవరి 2015 (18:04 IST)
జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటున్నవారు ఎక్కువవుతున్నారా అనిపిస్తోంది. ఇప్పటికే ఉన్నవారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దాన్ని బహిర్గతం చేస్తూ వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ పరిస్థితి ఎదురు కావడం జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడటం లేదు. ఒకవైపు జగన్ ఆస్తుల కేసులో ఈడీ తన విచారణను మరింత వేగవంతం చేస్తూ ఉండగా మరోవైపు బీజేపీ జగన్‌ పార్టీపై ఫోకస్‌ పెంచి ఆ పార్టీ నుంచి నాయకులను ఆకర్షిస్తోంది.

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న బలమైన కాంక్షతో ఉన్న భాజపా ఆ ప్రయత్నంలో భాగంగా మొదటిసారే సఫలీకృతమైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కందుల బ్రదర్స్‌ బీజేపీలో చేరడమే ఇందుకు ఉదాహరణ. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో కందుల వారు చేరిపోవడంతో జగన్‌కు సొంత జిల్లాలోనే గట్టి షాక్‌ తగిలిందంటున్నారు.
 
సీనియర్‌ నేతలుగా పేరొందిన కందుల రాజమోహన్‌రెడ్డి, కందుల శివానంద రెడ్డిలు భాజపా తీర్థం పుచ్చుకోవడంతో ఇక ఆ జిల్లాలో కదలిక మొదలైంది. ఇప్పుడిప్పుడే ఇతర జిల్లాల్లోనూ ఇలాగే మోడీ పాలనకు ఆకర్షితులై మరికొందరు నాయకులు భాజపాలో చేరే అవకాశం ఉందంటున్నారు భాజపా నాయకులు. ఇంకోవైపు మరో ఐదేళ్ల వరకూ అంటే, 2019 ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డి పార్టీని ఎలా నెట్టుకొస్తారనే ఆందోళన కూడా కొందరిలో కలుగుతోందనీ, దీనిపై లోలోన చర్చించుకుంటున్నట్లు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు చచ్చిపోవడంతో ఇక ఏపీలో జాతీయ పార్టీ అంటూ ఏదైనా ఉంటే, అది భాజపా ఒక్కటేనన్న ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నట్లు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. చూడాలి... జగన్ ఎలా నెట్టుకొస్తారో... నెగ్గుకొస్తారో...?!!

Share this Story:

Follow Webdunia telugu