Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రండీ బాబు... రండీ... భూమి ఇక్కడ సరసమైన ధరకు లభించును..

రండీ బాబు... రండీ... భూమి ఇక్కడ సరసమైన ధరకు లభించును..
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (10:44 IST)
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాలు పడుతోంది. ఎక్కడా చెప్పుకోదగ్గ ఎయిరుపోర్టులు లేవు. రైల్వే స్టేషన్లు లేవు. సౌకర్యాలు లేవు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలంటే ఇవన్నీ తప్పనిసరి.. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం వీటిన్నింటితో పారిశ్రామిక దుకాణం తెరిచేసింది. ఇక ఆంధ్రావైపు చూసే నాథుడే కరువవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఇందులో బోలెడు సౌకర్యాలు కల్పించారు. అడిగినవన్నీ వెంటనే ఇచ్చేస్తాం అన్నట్లు కనిపిస్తోంది. అనుమతులు మొదలుకుని విద్యుత్తు సౌకర్యం వరకూ అన్నింటిపై రాయితీలే రాయితీలు.. 
 
రాష్ట్రంలోకి పరిశ్రమలను ఆకట్టుకోవడానికి ప్రత్యేక రాయితీలతో ప్రకటించింది. అడిగిన వెంటనే భూమి కేటాయింపు.. అదీ ఒకటి రెండేళ్ళుకాదు. ఏకంగా 99 యేళ్ళ లీజు కింద ఇచ్చేస్తారు. వంద శాతం స్టాంపు డ్యూటీ ఫ్రీగా ఉంటుంది. 24 గంటలో విద్యుత్ సరఫరా కల్పిస్తారు. వాట్, సేల్స్ టాక్స్ నూటికి నూరు శాతం రీ ఎంబర్స్ మెంట్ కల్పిస్తామని చెప్పేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహళలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 2020 వరకూ ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది. వ్యాట్ ఐదేళ్ళు ఉచితం, ఆపై 25 శాతం, 50 శాతం, 75 శాతం దశలవారిగా ఉంటుంది. ఉత్పత్తి మొదలయినప్పటి నుంచి ఐదేళ్ళ వరకూ యూనిట్ కేవలం రూ.1కే ఇస్తామని ప్రకటించింది. 
 
పరిశ్రమల అధికారులకు ప్రత్యేక అధికారాలు
ఇక పరిశ్రమలను నెలకొల్పడానికి జిల్లా స్థాయిలో ఎదురయ్యే అవాంతరాలు, అభ్యంతరాలనైనా సరే అధిగమించే విధంగా వారికి పూర్తి అధికారాలను కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో స్థాయిలో 21 రోజుల్లో అన్ని రకాల అనుమతులు ఇస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో నెలకొల్పాలనుకున్న వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి  ఆ శాఖ అధికారులనే సుప్రీలుగా చేస్తున్నారు. 
 
నూతన విధానం ఏ ఏ శాఖలకు వర్తిస్తుంది ? 
నూతన విధానం రాష్ట్రంలో పలు రంగాలకు వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సు, టెక్స్టైల్స్, ఐటి, ఎలక్ట్రానిక్, ఎయిరోస్పేస్ మరియు డిఫెన్స్, ఆటోమొబైల్స్ మరియు ఆటో కంపోనెంట్స్, పెట్రోలియం, కెమికల్స్, పెర్టిలైజర్స్, ఫార్మాసిటికల్స్, విద్యుత్తు, మినరల్ ఆధారిత పరిశ్రమలు, లెదర్ వంటి పరిశ్రమలకు ఈ విధానం వర్తిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu