Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాశవీధిలో... ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) జిల్లాల్లో విమానాలు జుయ్....

ఆకాశవీధిలో... ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) జిల్లాల్లో విమానాలు జుయ్....
, శుక్రవారం, 8 ఆగస్టు 2014 (15:08 IST)
ఏపీలో కాలు కింద పెట్టే పనేలేదు. వైజాగ్ టూ విజయవాడ. నెల్లూరు టూ గుంటూరు. ఒంగోలు టూ తిరుపతి. చిత్తూరు టూ కర్నూలు. చిన్న చిన్న దూరాలకు కూడా ఎర్రబస్సు ఎక్కినంత ఈజీగా ఎయిర్ బస్సులో ప్రయాణించవచ్చు. ట్రైన్లో ట్రావెల్ చేసినంత సులభంగా ఫ్లైట్లో వెళ్లొచ్చు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఆకాశయానం అంతగా అందుబాటులోకి రానుంది మరి. కొత్తగా పద్నాలుగు విమానాశ్రయాలు తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నారు ఏపీ సీఎం చంద్ర బాబు. ఇప్పటికే వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఎయిర్‌పోర్టులున్నాయి. వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే కేంద్రం సమ్మతించింది. వీటికి తోడు మరో పద్నాలుగు విమానాశ్రయాల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ద్వితీయ శ్రేణీ పట్టణాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, అంతకన్న చిన్న పట్టణాల్లో ఎయిర్ స్ట్రిప్ లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించేదిశగా ఏపీ సర్కారు ఆలోచిస్తోంది.
 
శ్రీకాకుళంలో.. 
నవ్యాంధ్రలో ఉత్తర కోస్తా నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం పేరు మొదట వినిపిస్తోంది. ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. భవిష్యత్తులో దీన్ని ఎయిర్ పోర్టు చేసేందుకు 500 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని గుర్తించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎచ్చర్ల, రణస్థలం, గార మండలాల పరిధిలో భూముల లభ్యతపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ స్ట్రిప్ అందుబాటులోకి వస్తే జిల్లా వాసులకే కాకుండా ఒడిశాలోని  గజపతి, గంజాం, రాయగడ జిల్లా వాసులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే కళింగపట్నం పోర్టు ప్రతిపాదన సిద్ధంగా ఉంది. సీపోర్టుకి, ఎయిర్‌పోర్టు తోడయితే శ్రీకాకుళం జిల్లా మరింత అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు.
 
విశాఖపట్టణం...
వైజాగ్ విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ చేయడానికి సాధ్యపడ్డంలేదు. దీన్ని ఇంటర్నేషనల్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా వున్నా ఇండియన్ నేవీ అడ్డు పడుతోంది. ఇరవై నాలుగు గంటలూ ఎయిర్ పోర్ట్ పనిచేసేలా కేంద్రం అనుమతిచ్చినా నేవీ ఆంక్షలు విశాఖ ఎయిర్ పోర్టుకు తలనొప్పిగా మారింది.  దీంతో ముందుకొచ్చిన అంతర్జాతీయ సర్వీసులు వెనక్కి వెళ్తున్నాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ల్యాండవడానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు ముందుకొస్తున్నా.. నేవీ ఆంక్షలు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నాయి. విశాఖ విమానాశ్రయ స్థలం ఇప్పటికీ నేవీ ఆధీనంలో వుండటమే ఇందుకు కారణం. 
 
8 గంటలకు ముందు విమానాలు వస్తే ఇక్కడి ఎయిర్  ట్రాఫిక్ కంట్రోల్ పనిచేయదు. దీంతో వచ్చిన విమానాలు విశాఖ గగనతలంపైనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటోంది  ఆలిండియా ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్. ఎయిర్ పోర్ట్ ఇరవైనాలుగు గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటే ప్రయాణికులు గాల్లో చక్కర్లు కొట్టే తిప్పలు తప్పుతాయని భావిస్తున్నారు. 
 
కానీ, నేవీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనికి ప్రతిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. అంటే కొత్తగా స్థల సేకరణ చేసి పునాది రాయి నుంచి ఎయిర్ పోర్టు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టు వైజాగ్, కాకినాడ మధ్య ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ రెండు నగరాల మధ్య పీసీపీఐఆర్ కు ఎయిర్ పోర్ట్ తప్పని సరిగా అవసరం, అందుకే ఈ ప్రాంతాల మధ్య ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను నిర్మిచాలనుకుంటున్నారు.
 
మధురపూడి విమానాశ్రయం
అలాగే రాజమండ్రి లోని మధురపూడి ఎయిర్ పోర్ట్ విస్తరించాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 365 ఏకరాల  విస్తీర్ణంలో 1748 మీటర్ల పొడవు రన్ వే కలిగిన ఈ ఎయిర్ పోర్టు నుంచి రోజుకు 3 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అది కూడా రాజమండ్రి - హైదరాబాద్ కు మాత్రమే ఈ మూడు విమానాలు తిరుగుతున్నాయి. స్పైస్ జెట్ విమానాలు 2, జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఒక విమానం ఇక్కడి నుంచి సర్వీసులు అందిస్తున్నాయి.  
ప్రయాణికుల రద్దీ పెరిగినందున వచ్చే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి జెట్ ఎయిర్ వేస్ మరో విమాన సర్వీసును  ప్రారంభించనుంది. వాణిజ్య కూడలిగా ఉన్న రాజమండ్రి నుంచి ప్రతీ రోజూ డాక్టర్లు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు  ఇతర పారిశ్రామికవేత్తలు, చెన్నై, కలకత్తా, బొంబాయి, బెంగుళూరు, ఢీల్లీ వంటి నగరాలకు ఎక్కువగా  వెళ్తుంటారు.  హైదరాబాద్ తో పాటు మరిన్ని ప్రాంతాలకు కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా  ఉంటుందని భావిస్తున్నారు గోదావరి జిల్లాల ప్రజలు.
 
మధురపూడి సమస్యలు
రాజమండ్రి విమానాశ్రయానికి సమస్యలు కూడా ఎక్కువే ఉన్నాయి. రన్ వే పెంపు.. రాత్రి వేళల్లో విమాన రాకపోకలు కొనసాగించేలా సిగ్నల్ లైట్స్ వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. పెద్ద విమాన సర్వీసులు  రాకపోకల కోసం ఎయిర్ పోర్టు విస్తరించాలని 4 ఏళ్లుగా చేస్తున్న ప్రయాత్నాలు ఫలించడంలేదు. ఇందుకోసం  ఎయిర్ పోర్టు చుట్టూ సుమారు వెయ్యి ఎకరాల భూమిని అధికారులు సేకరించినా కార్యరూపం దాల్చలేదు. అలాగే  ప్రస్తుతం ఉన్న రన్ వేను సుమారు 5 వేల మీటర్లకు విస్తరించాల్సి ఉంది. భూముల కోనుగోలు, రన్ వే విస్తరణకు సుమారు 250 కోట్ల రూపాయాలు నిధులివ్వడానికి ఎయిర్ పోర్టు అధారిటీ సిద్దంగా ఉన్నా ఇన్నాళ్ల వరకూ దీనిపై  శ్రద్ద చూపిన నాధుడే లేకుండా పోయాడు.
 
గన్నవరం విమానాశ్రయం 
విజయవాడ విమానాశ్రయానికి బ్రిటీషు కాలంనాడే బీజం పడింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధ విమానాల కోసం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేశారు. 72 సంవత్సరాల క్రితం విశాఖ, తిరుపతిలో విమానాశ్రాయలు లేనప్పుడే.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదారాబాద్, చైన్నై, కాన్పూరు, బెంగుళూరుకు విమాన సర్వీసులు నడిపారు. గన్నవరం విమానాశ్రయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించికోకపోవడం.. విశాఖ, తిరుపతి ఎయిరుపోర్టుల అభివృద్ది సమాంతరంగా జరిగాయి. గన్నవరం ఎయిర్ పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 3 లక్షల మంది ఎన్నారైలతో పాటు వ్యాపారులు, ఇతర రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫలితంగా ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ సైతం పెరుగుతుంది.
 
ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంలో భాగంగా విజయవాడలో ఓ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మించాలనుకుంటోంది ప్రభుత్వం. విజయవాడ నుంచే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణం మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇది నూజివీడు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశముంది. ఎందుకంటే భవిష్యత్తులో స్టేట్ క్యాపిటల్ విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పడితే నూజీవీడు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టుకే స్థల సేకరణ జరగలేదు. మరి కొత్తగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల సేకరణ ఎలా చేస్తారో అర్థంకాని పరిస్థితి. అయితే కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు కాబట్టి అనుమతులు, నిధుల మంజూరు వేగవంతమవుతాయని ఆశిస్తున్నారు.
 
నెల్లూరులో విమానాశ్రయం 
దక్షిణ కోస్తా తీరం విషయానికి వస్తే నెల్లూరు-కావలి మధ్య ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నట్లు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది ప్రకాశం జిల్లాకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన దేవాలయాలతో పాటు బీచ్ టూరిజం అభివృద్ధి చేయాలనుకుంటోంది ప్రభుత్వం. దీన్నిబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్టు ఉండటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడి ఆక్వా రంగానికి కూడా ఎయిర్ పోర్టు అవసరం ఎంతైనా ఉంది.
 
చిత్తూరులో ఎయిర్ పోర్టు 
చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. ఇప్పటికే ఇక్కడ తిరుపతి విమానాశ్రయం ప్రయాణికులకు తగిన సేవలందిస్తోంది. దీన్ని ఇంటర్నేషనల్ చేయడానికి కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలోనే మరో ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుడుతోంది ఏపీ గవర్నమెంట్. కుప్పం నియోజకవర్గంలో రైతులు పండించే వాణిజ్య పంటలు..  దేశంలోని ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసేందుకు కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా దేశీయ విమానాశ్రయాల అభివృద్ధి బృందం కుప్పం నియోజకవర్గంలో పర్యటించి.. రెండు ప్రాంతాలను పరిశీలించింది. విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాల విశ్లేషణ చేసింది. నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలోని అమ్మవారి పేట, గుడుపల్లి మండలంలోని పొగురుపల్లి దగ్గరున్న ప్రభుత్వ,  ప్రైవేటు స్థలాలు కలిసి ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.
 
అనంతపురంకు బంపర్ ఆఫర్ 
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కో ఎయిర్ పోర్టు మంజూరు కావడంతో అనంతపురం జిల్లాకి కలిసొచ్చే అంశంగా మారింది. అనంతపురంలో నిర్మించనున్న ఎయిర్ పోర్టు స్థల పరిశీలనలో అధికారులు బిజీగా ఉన్నారు. తాజాగా జిల్లాకు మరో ఎయిర్ పోర్టు కూడా రానుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టు కోసం జిల్లా కేంద్రం సమీపంలో స్థల పరిశీలన చేస్తున్నారు. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరలోని మరూరు వద్ద 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎయిర్ పోర్టుకు అనువైన చోటుగా గుర్తించారు. దీనికి సంబంధించిన  భూములను వాటి, రికార్డులను కూడా పరిశీలించారు.
 
కడప ఎయిర్ పోర్టు 
కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంతో పాటు ఉన్న ఎయిర్ పోర్టుల అభివృద్ధి వార్త వెలుగుచూడ్డంతో.. కడప ఎయిర్ పోర్టుకు కొత్త ఊపిరొచ్చినట్టైంది. ఇక్కడి ఎయిర్ పోర్టు బ్రిటీషు కాలం నాటింది. తర్వాతి కాలంలో ఇది వినియోగంలో లేకుండా పోయింది. దివంగత వైఎస్ హయాంలో దీని పునర్నిర్మాణం జరిగి, ఎట్టకేలకు ఈ ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎయిర్ పోర్టు విధానం వల్ల ఈ ఎయిర్ పోర్టు నిర్వహణ సజావుగా సాగే అవకాశం కనిపిస్తోంది.
 
కర్నూలులో లోకాస్ట్ ఎయిర్ పోర్టు 
కర్నూలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణాకి  కేంద్రం ఎప్పటి నుంచో సమ్మతంగా ఉంది. యూపీఏ ప్రభుత్వ ప్రకటించిన దేశవ్యాప్త.. లో కాస్ట్ ఎయిర్ పోర్టుల లిస్టులో కర్నూలు పేరు కూడా ఉంది. ఒక గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. విజయవాడ తిరుపతి వంటి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి చేయడానికి ఏడాది సమయం తీసుకుంటుంది. మొత్తంగా ఓ ఐదేళ్లలోగా ఈ ఎయిర్ పోర్టులు ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ ప్రజలు.

Share this Story:

Follow Webdunia telugu