Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానికి భూమికావాలి : కృష్ణా, గుంటూరుల్లో ధరలకు రెక్కలు!

రాజధానికి భూమికావాలి : కృష్ణా, గుంటూరుల్లో ధరలకు రెక్కలు!
, ఆదివారం, 27 జులై 2014 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భారీగా భూమి కావాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన రైతులు, రియల్టర్లు భూముల ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా విజయవాడ - గుంటూరుల మధ్య ఏపీ రాజధాని ఏర్పాటంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 
 
ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య వస్తుందన్న వార్తల నేపథ్యంలో రెండు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉడా పరిధిలో ఉన్నకృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల సంఖ్యలో అనధికార లే ఔట్లు రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వ్యవసాయ భూముల్నిఎడాపెడా కొనేసి వాటిని నివాస భూములుగా మార్చి కోట్లుదండుకుంటున్నారు రియల్టర్లు. 
 
ఇలా ల్యాండ్ కన్వర్షన్ జరిపేసమయంలో నాలా ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. అయితే నిబంధనలకు తూట్లు పొడుస్తూ వందలాది వెంచర్లకు నాలా ఫీజు చెల్లించకుండానే కన్వర్షన్లు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు. దీంతో వీజీటీఎం ఉడా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపపట్టారు. 
 
ఉడా వీసీ ఉషాకుమారి నేతృత్వంలో ప్లానింగ్ అధికారుల బృందం విజయవాడ, నూజివీడు, గుంటూరు డివిజన్లలో సుమారు 50 వెంచర్లను పరిశీలించింది. ఇక్కడ 2006 నుంచి 2014 వరకు ఉడా అనుమతులు పొందిన వెంచర్లు 366 ఉన్నాయి. అయితే 2006కి ముందున్న నాలా చట్టం ఫీజు చెల్లింపు తప్పనిసరి నిబంధనలు కాకపోవటంతో ప్రభుత్వం వీటిపై సీరియస్‌గా దృష్టిసారించలేదు. 2006లో వచ్చిన చట్టం ప్రకారం.. 2008 తర్వాత వేసిన రియల్ వెంచర్లు ల్యాండ్ కన్వర్షన్ సమయంలో తప్పనిసరిగా నాలా ఫీజు చెల్లించాలి. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన విలువ ఆధారంగా 6 నుంచి 9 శాతం వరకు చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లోఅయితే 5 శాతం నాలా ఫీజు రెవెన్యూ శాఖకు చెల్లించాలి. అయితే నాలా ఫీజు చెల్లించని 202 వెంచర్లను అధికారులు గుర్తించారు. వాటి సమగ్ర వివరాలను త్వరలోనే జిల్లాల కలెక్టర్లకు పంపనున్నారు. 
 
ఇదిలావుండగా, రెండు జిల్లాల్లో సుమారు వందకుపైగా అనధికార వెంచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికార లే ఔట్ల వివరాలు సేకరించిందేకు ఇప్పటికే ఉడా అధికారులు గ్రామ కార్యదర్శుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్రమంగా గుర్తించిన వాటికి నోటీసులు జారీ చేయటానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఉడా పరిధి పెరిగి రెండేళ్లవుతున్నా ఉడాకు మాత్రం ఆ మేరకు ఆదాయం రావడంలేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu