Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెమీ ఫైనల్లో కాంగ్రెస్ జయకేతనం

సెమీ ఫైనల్లో కాంగ్రెస్ జయకేతనం
, మంగళవారం, 9 డిశెంబరు 2008 (15:08 IST)
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు గాను జరిగిన సెమీ ఫైనల్ పోరు రాజకీయ టైతో ముగిసినప్పటికీ, కాంగ్రెస్ తన బలమైన ప్రత్యర్థి బీజెపిపై 3-2 తేడాతో గెలుపు సాధించి ఆత్మస్థైర్యాన్ని నిలుపుకుంది. నాలుగు హిందీ భాషా ప్రాంత రాష్ట్రాలైన ఢిల్లీ, మధ్య ప్రదేశ, రాజస్థాన్, చత్తీస్‌గర్‌లలో ఓటర్లు కాంగ్రెస్, బిజేపీలను సమానంగా వరించడం గమనార్హం.

సెమీ ఫైనల్‌లో స్పష్టమైన విజయం సాధించకుండా ఓట్లను, సీట్లను, రాష్ట్రాలను పంచుకున్న లేదా మార్పిడి చేసుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫేవరైట్ ముద్ర లేకుండానే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కానున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ వంటి ఈ అసెంబ్లీ ఎన్నికలలో షీలా దీక్షిత్ ముచ్చటగా మూడోసారీ అద్భుతం సృష్టించారు. ఢిల్లీ గద్దెపై వరుసగా మూడోసారీ అడుగుపెడుతున్న ఏకైక మహిళా నేతగా షీలా దీక్షిత్ రికార్డు సాధించారు. దీంతో జ్యోతిబసు, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తర్వాత, దేశ చరిత్రలో అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడో సారి గెలుపొందిన తిరుగులేని నేతగా షీలా దీక్షిత్ భారత రాజకీయ చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్నారు.

అధికారాలపై ఆంక్షలు విధించబడిన నగర రాజ్యంగా అవతరించిన ఢిల్లీ పీఠంపై షీలా దీక్షిత్ చిరస్మరణీయమైన ముద్ర వేశారు. ఈమెతో పోలిస్తే బీజేపీ ప్రత్యర్థి వికె మల్హోత్ర మరీ పాతకాలం మనిషిలా ఢిల్లీ నగరవాసులకు కనిపించడం షీలాకు అనుకోని వరంలా మారగా బిజెపి వరుసగా మూడోసారి కూడా దేశ రాజధానిలో భంగపాటుకు గురైంది.

మరోవైపున జాతీయ రాజకీయాల్లో అంతగా ప్రాముఖ్యత లేని శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్‌లు మధ్యప్రదేశ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో తమ పార్టీలను సునాయాసంగా గెలుపు బాట పట్టించారు. ఇకపోతే రాజస్తాన్‌లో పెద్దగా గుర్తింపు లేని కాంగ్రెస్ నేత అశోక గెహ్లాట్ తన బలమైన ప్రత్యర్థి బీజేపీ పార్టీ తరపున ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వాన్ని గద్దె దింపేలా తమ శ్రేణులను ముందుకు ఉరికించారు.

కాబట్టి, ఈ అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించి చూస్తే మాటలు కట్టి పెట్టి చేతలకు మాత్రమే పనికల్పించిన వారే ఈ దఫా విజయం సాధించారని అర్థమవుతుంది. మిజోరంలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో గెలుపు సాధించడం ద్వారా 3-2 తేడాతో ఆధిక్యతను నిలుపుకుంది.

అయితే 2003 డిసెంబర్ సెమీ ఫైనల్ ఎన్నికలలో సాధించిన విజయాన్ని జాతీయ వాణికి పట్టం కట్టినట్లుగా వర్ణించి ముందస్తు ఎన్నికలు ప్రకటించి ఎన్డీఏ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ఈ సారి చేయకుండా జాగ్రత్తపడింది. ముందస్తు ఎన్నికల్లో ఎన్టీఏ కుప్పగూలిన విషయం తెలిసిందే.

మొత్తం మీద చూస్తుంటే లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్ ముందుగా జరగబోవని తేలిపోయింది. యుపిఎ ప్రభుత్వం వోట్ ఆన్ ఎకౌంట్ కాకుండా ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్‌నే సమర్పిస్తుందని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

Share this Story:

Follow Webdunia telugu