Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్.జగన్ ఓదార్పు యాత్ర ఖరీదు రూ. 6 కోట్లు...!!!

వైఎస్.జగన్ ఓదార్పు యాత్ర ఖరీదు రూ. 6 కోట్లు...!!!
FILE
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు, జగతి పబ్లికేషన్ మేనేజింగ్ డైరక్టర్ వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి చేపట్టిన ఓదార్పు యాత్ర ఖరీదు అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు. ఇదేంటీ.. ఈ యాత్ర ధర ఆరుకోట్లా అని ఆశ్చర్యపోతున్నారా.

అవునండీ. తమ ప్రియతమ నేత వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 600 మంది మరణించినట్లు అనధికార లెక్కలు. ఈ మృతుల కుటుంబాలకు వైఎస్.జగన్ స్వయంగా ఆర్థికసాయం చేయనున్నారు. అదీ.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున. ఆ ప్రకారంగా చూస్తే.. 600 కుటుంబాలకు ఆరు కోట్ల రూపాయలను ఆయన అందజేయనున్నారు.

అంతేకాకుండా ఇది పేరుకు మాత్రమే ఓదార్పు యాత్ర అయినప్పటికీ.. రాజకీయ సమ్మిళతంతో కూడుకున్న యాత్రగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ తొలిదశ పర్యటనలో పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో 88 మంది అశువులు బాసినట్టు చెపుతున్నారు.

అంటే.. ఈ రెండు జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు చొప్పున మరణించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 600 కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అంటే.. ప్రతి నియోజకవర్గంలోనూ మృతులు ఉన్నారా అని అనుకుంటే.. అది పొరపాటే అవుతుంది. కానీ., జగన్ మాత్రం తన ఓదార్పు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని భావించడం ఇక్కడ గమనించదగ్గ అంశం.

ఇకపోతే.. తండ్రి మరణానంతరం రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన వైఎస్.జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వీలుగా ఏర్పాట్లూ భారీ ఎత్తునే సాగుతున్నాయి. ఆయన పర్యటించే మార్గం పొడవునా ఫ్లెక్సీ బోర్డులు, భారీ బ్యానర్లు, కటౌట్లు.. ఇత్యాది ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ కుటుంబ వీర విధేయులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే.. ఈ రెండు జిల్లాల్లో లక్షలాది ఫ్లెక్సీ బోర్డులకు ఆర్డర్లు ఇచ్చినట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

వైఎస్ మరణానంతరం నిస్తేజంగా మారిన కాంగ్రెస్ శ్రేణులను ఓదార్పు, పలుకరింపులతో ఉత్తేజపరచడమే కాకుండా, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడమే జగన్ ఓదార్పు యాత్రంలోని అసలు అంతరార్థంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాత్ర పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం అండదండలు లేకపోలేదని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu