Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారిన అధిష్టానం వ్యూహం: 2014 సీఎం జగన్..?!!

మారిన అధిష్టానం వ్యూహం: 2014 సీఎం జగన్..?!!
FILE
రాజకీయాల్లో నేతల అభిప్రాయాలు గంటకూ గంటకూ మారుతుంటాయి. నిన్న పనికిరాని నాయకుడు నేడు వారికి ఎంతో అమూల్యమైన నేతగా మారిపోతాడు. ఇదే రాజకీయమంటే.. అని కొందరు నాయకులు బహిరంగంగానే చెప్పేస్తుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే.. ఇపుడు రాష్ట్రంలో వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నాయి.

భరించలేని ఉక్కపోతా.. ఎండ దెబ్బలను సైతం లెక్క చేయక జగన్ "ఓదార్పు"కోసం బారులు తీరుతున్న జనాన్ని చూసి కాంగ్రెసేతర పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లోని జగన్ వ్యతిరేక వర్గానికైతే ఏసీల్లోనూ ముచ్చెమటలు పడుతున్నాయి.

కారణం జగన్‌కు జన నీరాజనం. కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ నేతగా వైఎస్ జగన్ ఖ్యాతికెక్కారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టును గమనించిన అధిష్టానం తన రూటును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్న దానిపై అధిష్టానానికి బెంగ పట్టుకున్నట్లు సమాచారం. సమైక్యాంధ్రను కోరుతున్న సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ఇస్తే ఎలా స్పందిస్తారో.. అక్కడ పార్టీ భవితవ్యమేమిటో.. అని సుదీర్ఘ కాలంగా యోచన చేస్తున్నట్లు భోగట్టా.

అటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదురొడ్డి కాంగ్రెస్‌కు వైభవాన్ని కట్టబెట్టగల నాయకుడు పార్టీలో ఎవరున్నారా...? అని ఆరా తీసిన అధిష్టానం చివరికి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేమంటే... స్వర్గీయ వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్‌కే సీమాంధ్ర బాధ్యతను అప్పజెప్పాలన్నది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ ఓదార్పుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రాబోయే నాలుగేళ్ల కాలంలో సీఎం రోశయ్యకు బాసటగా నిలుస్తూనే 2014 నాటికి పూర్తిస్థాయి క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోమని పరోక్షంగా జగన్‌కు సంకేతాలు పంపినట్లు సమాచారం.

అధిష్టానం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఒకవైపు... ఉత్తరాంధ్రలో "ఓదార్పు"కు ప్రజలు ఇస్తున్న ప్రోత్సాహం మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. అయితే జగన్ వైరి వర్గానికి మాత్రం బుర్రలు వేడిక్కిపోతున్నాయి. దటీజ్ వైఎస్ జగన్..!!

Share this Story:

Follow Webdunia telugu