Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదమ్మా...!!

నీ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదమ్మా...!!
PTI
ఆకాశంలో సగం, అవనిలో సగం.. అన్నింటా సగం.. సగం అయిన మహిళా సాధికారతలో మాత్రం ఘరానా మోసం. ఈ నేపథ్యంలో మహిళా సాధికారత కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉన్నా వారికి దక్కాల్సిన ఫలం మాత్రం అందని ద్రాక్షలాగే మారింది. వస్తాయనుకున్న అవకాశాలు వచ్చినట్లే వచ్చి అనేకసార్లు చేజారిపోయాయి. ఎట్టకేలకు సోమవారం భారతదేశంలోని మూడు రాజకీయ పార్టీలు మినహా అన్ని పార్టీలు మహిళా బిల్లుకు "జై" కొట్టడానికి సిద్ధమయ్యాయి. దీంతో యావద్భారతావనిలోని మహిళలు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు.

కానీ చారిత్రాత్మక మహిళా బిల్లు సభలో ఆమోదం పొందటానికై నానా తంటాలు పడుతోంది. అడుగడుగునా ఆయా పార్టీలకు చెందిన సభ్యులు బిల్లులో మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఆమోదింపజేయాలని పట్టుబట్టారు. దీంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. 14 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మహిళలకు మరో 24 గంటల నిరీక్షణ తప్పలేదు.

సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ.. ఇలా అనేక రంగాల్లో మహిళలకు తగు న్యాయం చేయాలనే దిశగా భారత సర్కారు పలుమార్లు యత్నించింది. ఈ క్రమంలో 1993 స్థానిక సంస్థలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఆమోదానికి నోచుకోలేదు.

ఇక లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రతినిధుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే ఏనాడూ.. సగటున అర్థసెంచరీ దాటలేదు. 1952లో కేవలం 22 మంది మహిళా ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మహిళల ప్రాతినిథ్యం అంతంత మాత్రంగానే సాగింది. దీంతో 1980 నుంచి మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టారు.

దీంతో ఆయా పార్టీలు తమ వైఖరిని మార్చుకుని మహిళలకు ఉడుతా భక్తిగా కొన్ని స్థానాలను కేటాయించేందుకు ముందుకు వచ్చాయి. అయినప్పటికీ 2004 ఎన్నికలలో 51 మంది మహిళలు మాత్రమే పార్లమెంటుకు వెళ్లగలిగారు. మొత్తమ్మీద చూస్తే సగటున 15 నుంచి 40 మధ్యే వారి సంఖ్య పరిమితమైంది. దీంతో తమవంతు కోటా తమకు కేటాయించాలని మహిళలు పట్టుబట్టారు.

మహిళల పోరాటం ఫలితంగా 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రభుత్వాలు దానిని ఆమోదింప చేయడానికి నాలుగుసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాయి. బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు కూడగట్టలేక పోయాయి. 2008లో చివరగా రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పటికీ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అంతర్గత విధానాలతో బిల్లుకు మోక్షం రాలేదు.

ఇప్పుడు మరోసారి యూపీఎ ప్రభుత్వం మహిళా బిల్లును ఎలాగైనా ఆమోదింపజేయాలని శతవిధాలా యత్నిస్తోంది. అయితే బిల్లులో మార్పులు చేసి తీరాల్సిందేనని ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం చెందేనాటికి ఎటువంటి మార్పులు చోటుచేసుకుని బయటపడుతుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu