Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఉద్యమ హైజాక్‌కు వ్యూహ ప్రతి వ్యూహాలు!

తెలంగాణ ఉద్యమ హైజాక్‌కు వ్యూహ ప్రతి వ్యూహాలు!
File
FILE
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేయడమే కాకుండా, తెలంగాణ పేటెంట్ తమకే సొంతమనే ధోరణితో ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉద్యమ వేడిని చల్లారనీయకుండా ఏదో ఒక రూపంలో విద్యార్థులను, ఆందోళనకారులు, ప్రజలను రెచ్చొగొడుతోంది. డిసెంబరు 31వ తేదీ తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరించక పోతే కృత్రిమ భూకంపం సృష్టిస్తామని, సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతామని ప్రకటనలు చేస్తోంది. ఇందులో ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు ప్రధాన భూమికను పోషిస్తున్నారు.

ఇకపోతే.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు తమ భవిష్యత్‌ కోసం సరికొత్త రాజకీయ క్రీడలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో ఒక్క మాట చెప్పించలేని తెదేపా సీనియర్ నేతలు.. తెదేపా తెలంగాణ ఫోరం పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేంద్ర గౌడ్, కడియం శ్రీహరి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంత జరిగినా పెద్దగా పట్టించుకోని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇపుడు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ ఉద్యమం తమ చేజారి పోకుండా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శ పేరుతో ప్రత్యేక ఓదార్పు యాత్రను చేపడుతున్నారు. దీనికి ఉద్యమ పురిటిగడ్డగా పేరొందిన కరీంనగర్‌ నుంచి శనివారం శ్రీకారం చుడుతున్నారు. ఇందులో ఆ పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పాలు పంచుకోనున్నారు.

ఒట్టి చేతులతో ఓదార్పు యాత్ర చేపడితో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన నేతలు.. తమకు తోచిన రీతిలో ఉడతాభక్తి సాయం చేశారు. ఇలా వచ్చిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేస్తూనే.. పార్టీని మరింత బలోపేతం చేస్తూ, తమ పట్టును, పరపతిని పెంచుకునే దిశగా ప్రణాళిక రూపొందించారు.

ఇదిలావుండగా, ఉద్యమ వేడిని రగిలించడంలో తెరాస శ్రేణులు, కేసీఆర్ పూర్తిగా సఫలీకృతులయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై కాంగ్రెస్, తెదేపాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా, తెదేపా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందనే విషయం ఇట్టే తేటతెల్లమవుతోంది. దీంతో ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

తెలంగాణ తెచ్చేది తామే.. ఇచ్చేది తామేనన్న నినాదంతో తెలంగాణ ప్రజల మధ్య యాత్ర చేపట్టనున్నారు. దీంతో అటు తెరాసకు చెక్ పెట్టడమే కాకుండా, తెదేపాను నామరూపాలు లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ నేతల వ్యూహంగా ఉంది. అందుకే తమ వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి ఓదార్పు యాత్రపై ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలు ఎంత హడావుడి చేసినా.. ఎవరి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఎన్నికలొస్తే తేలిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu