Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పటికీ.. చిరంజీవి అదృష్టవంతుడే!

ఇప్పటికీ.. చిరంజీవి అదృష్టవంతుడే!
, గురువారం, 9 జులై 2009 (20:21 IST)
FileFILE
ప్రజారాజ్యం! రాష్ట్ర రాజకీయాలకు కొత్త పార్టీ. వెండితెర మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగానే పార్టీ పేరు. మరికొద్ది రోజుల్లో తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న పార్టీ. "మార్పు" నినాదంతో రాజకీయ చిత్రపటంపై సరికొత్త ఆశలు రేపింది. సామాజిక న్యాయం పేరుతో రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పీఆర్పీ కార్యాలయం వలస నేతలతో కిక్కిరిసి పోయింది. రోడ్‌షోలకు జనం నీరాజనాలు పలికారు. అధికారం ప్రజారాజ్యానిదే అన్నంతగా ప్రజలు అభిమానం చూపించారు. జే కొట్టారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికల ఫలితాల్లో అంతా తుస్సుమంది. ఫలితంగా ఆ పార్టీతో పాటు.. పీఆర్పీ నేతల భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, ఇంత జరిగినా.. ఒక్కటి మాత్రం నిజం. పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఇప్పటికీ రాష్ట్ర ప్రజల గుండెల్లో మెగాస్టారే. ఆయన నిర్వహించిన రోడ్‌షోలకు వచ్చిన జనం స్వచ్ఛందంగా తరలి వచ్చిన వారేకానీ, పైసలిచ్చి తరలించిన వారు కాదు. వీరిలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు.

అయితే, చిరంజీవి, మెగాస్టార్ రోడ్‌షోలను అభిమానించినంతగా ప్రజారాజ్యం పార్టీని ఆదరించలేదు. చిరంజీవికి అప్పటికీ.. ఇప్పటికీ.. మంచి పేరుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు కూడా చిరంజీవిని ఎక్కడా విమర్శలు చేయలేదు. ఆయనను సున్నిత మనస్కుడు, రాజకీయాలకు ఏమాత్రం సరిపోరు అన్నారేగానీ, వ్యక్తిత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు.

ఇదిలావుండగా, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత సంచలనాలే చోటు చేసుకున్నాయి. ఆరంభం నుంచి అంతం వరకు అన్నీ అదుర్స్. ఎన్నికల పోలింగ్ నాటికి పార్టీ వ్యవస్థాపకులు ఒక్కొక్కరు తప్పుకున్నారు. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ చేసిన నష్టం అంతాఇంతా కాదు. దీనికి తోడు చిరు బావమరిది అల్లు అరవింద్ వ్యవహించిన తీరు, ఒంటెద్దు పోకడలు అటు చిరంజీవి ఇమేజ్‌కు, ఇటు పార్టీకి చెడ్డపేరును తెచ్చిపెట్టాయన్న విమర్శలున్నాయి.

మరోవైపు రెండు బలమైన నిర్మాణం కలిగిన పార్టీల మధ్య పీఆర్పీకి వ్యతిరేకంగా నెగటివ్ ప్రచారం జరిగింది. నకిలీ బీసీలకు టిక్కెట్లు
webdunia
FileFILE
కేటాయింపులు, సీట్ల అమ్మకాలు, బీసీ సంఘాల సహాయ నిరాకరణ, సొంత సామాజిక వర్గం పెద్దల ఆగ్రహాలు, సహచర సినీ నటులు ఆరోపణలు, దూషణల పర్వం మధ్య "అందరివాడు"గా ఉన్న చిరంజీవి "ఒంటరి" వాడయ్యాడు.

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో, సడలని ఆత్మస్థైర్యంతో సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామాన్ని ఎదుర్కొన్నారు. సుమారు 17 శాతం ఓటు బ్యాంకుతో 70 లక్షల ఓటర్లను ఆకర్షించగలిగాడు. ఇది చిరంజీవి తొలి నైతిక విజయంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే.. పార్టీ ఆవిర్భావం తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు కేంద్ర బిందువు అల్లు అరవింద్ అని రాష్ట్రం యావత్తు కోడై కూసింది.

అంటే పార్టీపై వచ్చిన దుష్ప్రచారానికి అరవింద్ కారణమని తేలిపోయింది. ఇది మెగాస్టార్ రెండో నైతిక విజయంగా చెప్పుకోవచ్చు. పార్టీలో చోటు చేసుకున్న వాటికి చిరంజీవి కారణభూతుడు కాదన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్నే రాష్ట్ర ప్రజలతో పాటు.. ఆయన అభిమానులు ఇప్పటికీ నమ్ముతున్నారు. అలా నమ్మడమే కాకుండా అమాయకుడైన చిరంజీవిని కొందరు నమ్మించి మోసం చేశారనే వాదనలు వచ్చాయి. ఇది ఒకరంగా చిరు పట్ల వ్యక్తమవుతున్న సానుభూతిగా చెప్పుకోవచ్చు.

వీటన్నింటినీ తట్టుకుని ఓటరు తీర్పును హుందాగా స్వీకరించిన మృదుస్వభావి. "ఓటమిలోనూ విజయాన్ని రుచి చూశా"నంటూ చెప్పుకున్నారు చిరంజీవి. రెండంకెల సంఖ్యలో వచ్చిన సీట్లను చూసి దిగాలుపడక పార్టీ క్యాడర్‌ "చేయి" జారిపోకుండా ఒకవైపు చూసుకుంటూనే, మరోవైపు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. సుదీర్ఘ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులా ఓటమికి కుంటిసాకులు చెప్పకుండా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించిన రియల్ స్టార్ చిరంజీవిని ఇప్పటికీ "అదృష్టవంతుడే" అంటారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu