తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త... కట్టుకున్న భార్యను పట్టపగలు అందరూ చూస్తుండగా గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణం విజయవాడ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన స్థానికులను కత్తి చూపి బెదిరించిమరీ భార్య గొంతుకోసేశాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ హత్యతో విజయవాడ ఉలిక్కిపడింది.
స్థానిక దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40) నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30)ని ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నాడు. భర్త భవానీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా, భార్య సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. విభేదాల కారణంగా ఏడాదిన్నరగా విడిగా ఉంటున్నారు. సరస్వతి రోజూ నూజివీడు నుంచి ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. రోజూలాగే గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులకు హాజరయ్యారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రి నుంచి బయటకు రాగానే.. అక్కడే మాటు వేసిన విజయ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో మెడపై, గొంతుపై పొడిచాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న జనం.. అతడిని నిలువరించేందుకు ప్రయత్నించగా కత్తితో బెదిరించాడు. రక్తపుమడుగులో పడిన భార్య విలవిల్లాడుతుండగా.. ప్రాణాలు విడిచేవరకూ విజయ్ కత్తితో అక్కడే నిలుచున్నాడు.
ఇంతలో అక్కడకు చేరుకున్న సూర్యారావుపేట సీఐ అహ్మద్ అలీ, ఇతర పోలీసు సిబ్బంది విజయ్‌ను మాటల్లో పెట్టి ఒక్కసారిగా చుట్టుముట్టారు. స్థానికుల సాయంతో చాకచక్యంగా కత్తిని లాక్కుని నిందితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం తర్వాత సరస్వతి ప్రవర్తనపై అనుమానంతో విజయ్ తరచూ గొడవకు దిగేవాడని, దీంతో ఆమె నూజివీడులో పోలీసులకు భర్తపై గతంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.