ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ నగ్న ముఠా హల్చల్ చేస్తోంది. ఈ ముఠాకు చెందిన సభ్యులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల మేరఠ్‌లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో నిర్జన ప్రదేశంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్థులు తెలిపారు.
బాధిత మహిళ కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారన్నారు. స్థానికంగా వారి కోసం గాలించినా ఎవరూ కనిపించలేదని అన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదని బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పటికీ భయం, అవమానభారంతో ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని.. పరిస్థితులు తీవ్రంగా మారుతుండడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామ పెద్ద తెలిపారు.
భారాలా, దౌరాలా సహా పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్‌ను చూశామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని తెలిపారు. గ్రామాలకు సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో ఈ ముఠాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికి డ్రోన్‌లను ఉపయోగించి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించినట్లు తెలిపారు.