న్యూజిలాండ్ పర్యటనలో.. స్పిన్ బౌలర్లు ఈదురుగాలుల ప్రభావం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని టీం ఇండియా స్పిన్ ధిగ్గజం ఎరాపల్లి ప్రసన్న పేర్కొన్నాడు. ఒక్కోసారి ఈ గాలులు కూడా బౌలర్లకు సాయం చేస్తాయని అన్నాడు.
వాతావరణం లాంటి విషయాలను గూర్చి పెద్దగా ఆలోచించకుండా... ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలపైనే దృష్టి పెట్టాలని ప్రసన్న తెలిపాడు. ప్రతి ఒక్కరూ వైవిధ్యం ప్రదర్శిస్తేనే కివీస్‌లో స్పిన్నర్లు రాణిస్తారనీ.. అదే సమయంలో ఎక్కువ ప్రయోగాలు చేస్తే దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించాడు.
ప్రతి బంతితోనూ భారత స్పిన్నర్లు ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదనీ.. కేవలం బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు మాత్రమే పరిమితం కావాలని, వారిచేత తప్పులు చేయించాలని ప్రసన్న చెప్పాడు. ఈ విషయంలో వెటోరీని చూసి టీం ఇండియా స్పిన్నర్లు చాలా విషయాలు నేర్చుకోవచ్చునని వ్యాఖ్యానించాడు.