శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు గంభీర్, నెహ్రా కృతజ్ఞతలు
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను భారత స్టార్ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు కలిశారు. కండరాల్లో ఏర్పడిన గాయానికి ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంకకు వెళ్లిన గంభీర్, ఆశిష్ నెహ్రాలు, త్వరితగతిన చికిత్సను పూర్తి చేసినందుకుగాను ఆ దేశాధ్యక్షుడు రాజపక్సేకు కృతజ్ఞతలు తెలియజేశారు. సహచరుడు, శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ సలహా మేరకు కండరాల్లో గాయానికి చికిత్స పొందేందుకు గంభీర్, నెహ్రాలు శనివారం లంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాజపక్సేను ఆయన నివాసంలో గంభీర్ నెహ్రాలు కలిశారు. ఇంకా తమ చికిత్సకు సహకరించిన వైద్యులకు, శ్రీలంక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.రాజపక్సే అభ్యర్థన మేరకే ఆయుర్వేద వైద్య నిపుణులు ఎలియన్‌తా వైట్ గంభీర్ నెహ్రాలకు వైద్య సేవలు చేశారు. దీంతో గాయం నుంచి కోలుకునేందుకు చికిత్స చేసిన డాక్టర్ వైట్‌కు, రాజపక్సేలకు గంభీర్, నెహ్రాలు ధన్యవాదాలు తెలుపుకున్నట్లు లంక సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇకపోతే.. ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడుతున్నారు. వీరిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతం గంభీర్‌కు గాయం కాగా, మొహలీలో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆశిష్ నెహ్రాకు గాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా రాజపక్సే సిఫార్సు మేరకు డాక్టర్. వైట్ వద్ద చికిత్స పొందడం విశేషం.