మొదటి టెస్ట్ మ్యాచ్‌లో... తమ విజయావకాశాలను పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ దెబ్బతీశాడని శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్థనే వాపోయాడు. కరాచీలోని జాతీయ స్టేడియంలో పాక్-లంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
అనంతరం జయవర్ధనే మీడియాతో మాట్లాడుతూ... అద్భుతమైన ఫామ్‌తో యూనిస్ చెలరేగి ఆడాడనీ, నిజంగా అతని ఆటతీరు ప్రశంసనీయమని అన్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సమయం నిలిచి ఉండటమేగాకుండా, ట్రిపుల్ సెంచరీని సాధించిన యూనిస్.. మ్యాచ్ డ్రా అయ్యేందుకు కీలకపాత్ర పోషించాడన్నాడు. యూనిస్ ఆటతీరే లంక విజయావకాశాలకు గండికొట్టిందని మహేళ పేర్కొన్నాడు.
అయినప్పటికీ... తమ జట్టు సభ్యుల ప్రదర్శన సంతృప్తికరంగానే ఉందని జయవర్ధనే సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే ఓపెనర్‌గా బరిలో దిగిన వెంటనే అవుటయిన తరంగ పరనవితనను వెనకేసుకొస్తూ... అతనో గొప్ప ఆటగాడని అన్నాడు. చిన్న పొరపాట్లు జరగడం సహజమేననీ, ఈ మ్యాచ్ నుంచి అతనెంతోగానో నేర్చుకున్నాడని జయవర్ధనే వివరించాడు.