రేపు ముంబై ఇండియన్స్-చెన్నయ్ సూపర్ కింగ్స్ ఢీ..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్లు గురువారం ముంబైలో తలపడనున్నాయి. రెండు రోజుల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అదే ఊపుతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాలనే ధీమాతో బరిలో దిగుతున్నారు. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ మూడింటిలో పరాజయం పాలైన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో మ్యాచ్‌లోనయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆరాపడుతోంది.ఇదిలా ఉంటే.. వన్డేలలోనే కాకుండా పొట్టి క్రికెట్‌లోనూ తన సత్తా చాటుకుంటున్న లిటిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తన అత్యుద్భుత ప్రదర్శనతో ఐపీఎల్-3 టాప్ స్కోరు కార్డులో సైతం జట్టును ముందంజలో నడిపించాడు. అంతేగాకుండా జట్టులోని జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి భారత స్టార్లు సైతం లిటిల్ మాస్టర్‌కు మరింత శక్తినిచ్చి జట్టు దిగ్విజయంగా సాగేందుకు తమవంతు సాయం చేస్తున్నారు.మరోవైపు.. నిన్న జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఊతప్ప ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసి 36 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చెన్నై బ్యాట్స్‌మన్‌లలో బద్రీనాథ్ 31 పరుగులు తప్ప మిగిలిన వారంతా అతి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన సంగతి విదితమే. కాగా.. చెన్నైకి ఇది వరుసగా మూడో పరాజయం కావటం గమనార్హం. ఈ నేపధ్యంలో రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా సరే విజయం సాధించాలని సీఎస్‌కే గట్టి పట్టుదలతో ఉంది.