యూనిస్, అఫ్రీదీలకు ప్రెసిడెన్షియల్ అవార్డులు..!!
నిషేధానికి గురైన మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్, ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ అఫ్రీదీలకు ప్రెసిడెన్షియల్ అవార్డులను ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరియు పాక్ ప్రభుత్వం నిశ్చయించుకున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఉన్న ఆరోపణలు, నిషేధం.. తదితర విషయాలను పక్కనబెట్టి ఇంగ్లండ్‌లో జరిగిన ట్వంటీ 20 టోర్నీలో వీరు ప్రదర్శించిన ఆటతీరుకుగానూ ఫెర్‌ఫార్మెన్స్ అవార్డులతో సత్కరించనున్నాయి.కాగా.. గత జూన్ నెలలో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ ట్వంటీ 20 టోర్నీలో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకుగానూ యూనిస్ ఖాన్‌కు ప్రెసిడెన్షియల్ అవార్డును అందించనున్నారు. అలాగే ఇదే టోర్నీ సెమీ ఫైనల్స్‌లో అత్యద్భుత ప్రదర్శనకుగానూ షాహిద్ అఫ్రీదీని మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ బిరుదంతో సత్కరించనున్నారు.ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ జాతీయ జట్టు వరుస పరాజయాలకు బాధ్యులను చేస్తూ యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న షాహిద్ అఫ్రీదీ మూడు మిలియన్ల రూపాయల ఫైన్‌తోపాటు ఆరు నెలలపాటు నిషేధం విధించిన సంగతి విదితమే.మరోవైపు.. వచ్చే నెలలో వెస్టిండీస్‌లో జరుగనున్న ట్వంటీ 20 ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు పర్యటించనున్న పాకిస్థాన్ జట్టుకు షాహిద్ అఫ్రీదీని మంగళవారం సెలెక్టర్లు కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అవార్డుల విషయం తెలుసుకున్న యూనిస్ మాట్లాడుతూ.. ఈ అవార్డును ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలనీ, అవార్డును అందుకోబోతున్నందుకు గర్వంగా ఉందని అన్నాడు. ఎల్లప్పుడూ పాకిస్థాన్ పౌరుడిగా ఉండేందుకు తాను ఇష్టపడుతాననీ, దేశ గౌరవాన్ని పెంపొందించేందుకు మరింతగా కృషి చేస్తానని యూనిస్ పేర్కొన్నాడు.