బెంగళూరు ఛాలెంజర్స్‌తో సూపర్ కింగ్స్‌కు బలపరీక్షే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ బలపరీక్షకు సిద్ధమవుతోంది. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగే 18వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరతో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే మూడు విజయాలతో ముందంజలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. జాక్వెస్ కల్లీస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తప్పకుండా చెన్నైపై నెగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత నాలుగు మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ కలీస్ 65, 89, 44, 66 పరుగులు సాధించాడు. ఇంకా జట్టును సమర్థవంతంగా నడిపే నాయకుడిగా, జట్టుకు విజయం సంపాదించిపెట్టే ఆల్‌రౌండర్‌గా కలీస్ వ్యవహరిస్తున్నాడు. దీంతో కలీస్, మనీష్ పాండే వంటి నైపుణ్యం గల క్రికెటర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పటిష్టంగా ఉంది. కానీ మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో తప్పుకోవడం, కెప్టెన్సీ సారథ్యాన్ని సురేష్ రైనా చేపట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ బలహీనపడింది. సురేష్ రైనా నాయకత్వంలో గత శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన 11వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పంజాబ్‌తో జరిగిన 16వ లీగ్ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో వరుస విజయాలతో తన హవాను కొనసాగిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నెగ్గడం సూపర్ కింగ్స్‌కు బలపరీక్ష లాంటిదేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.