ట్వంటీ 20లలో బ్యాట్స్‌మెన్లదే హవా: హర్భజన్
పొట్టి క్రికెట్ ఫార్మాట్ అయిన ట్వంటీ 20 టోర్నీలలో బ్యాట్స్‌మెన్లదే హవా అని టీం ఇండియా బౌలర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో ముంబై ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్న భజ్జీ మాట్లాడుతూ.. టీ 20లో బ్యాట్స్‌మెన్‌ల దూకుడుకు బౌలర్లు అడ్డుకట్ట వేయటం అంత సులువు కాదనీ, అందుకే ఈ టోర్నీలలో బ్యాట్స్‌మెన్‌లదే హవాని గట్టిగా చెప్పవచ్చన్నాడు.చివరి బంతివరకూ వీర బాదుడు బాదేందుకు బ్యాట్స్‌మెన్‌లకే అవకాశం ఉంటుందనీ, బౌలర్ల పరిస్థితి అలా కాదనీ.. పరుగులేమీ ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేలా చూడటమే చాలా కష్టమని హర్భజన్ పేర్కొన్నాడు. ప్రతి జట్టులోనూ ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు ఉన్నప్పటికీ ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు. ఈ క్రమంలో వికెట్లు పడితే ఓకేగానీ, వికెట్లు పడకపోతే బౌలర్లపై మరింత ఒత్తిడి పెరుగుతుందని భజ్జీ చెప్పుకొచ్చాడు.