గత నిర్ణయానికే కట్టుబడి ఉంటా: మాస్టర్ బ్లాస్టర్
వెస్టిండీస్‌లో జరుగబోయే ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో ఆడే ఉద్దేశ్యం తనకు లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తేల్చి చెప్పాడు. గతంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడకూడదని తాను తీసుకున్న నిర్ణయానికే ప్రస్తుతం కట్టుబడి ఉన్నాననీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ టోర్నీలో ఆడే ప్రసక్తే లేదని మాస్టర్ స్పష్టం చేశాడు.ఈ విషయమై సచిన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరుగబోయే ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో తాను ఆడబోనని అన్నాడు. 2007 నుంచి తాను ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడటం లేదనీ, ఇప్పుడు తాజాగా ఆడే ఉద్దేశ్యమూ లేదనీ.. గత నిర్ణయానికి కట్టుబడే ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలనీ, ప్రస్తుతం ఈ అంశం అంత చర్చనీయాంశం కాదని భావిస్తున్నట్లు సచిన్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. తాజా ట్వంటీ 20 ప్రపంచ కప్‌కు భారత క్రికెట్ నియంత్రణా మండలి ఇప్పటికే ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్‌లో మాస్టర్‌కు స్థానం కల్పించలేదు. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మూడో అంచె పోటీలలో చెలరేగి ఆడుతూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సచిన్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడితే బాగుంటుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌తో సహా పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయ పడతున్నారు. అయితే సచిన్ మాత్రం ససేమిరా అంటున్నాడు. మరోవైపు బీసీసీ ప్రకటించిన ప్రాబబుల్స్ నుంచే పదిహేనుమంది ఆటగాళ్లను ఎంపిక చేయాలనే నిబంధన ఏమీ లేదనీ అంతర్జాతీయ క్రికెట్ మండలి చెప్పటం కొసమెరుపు.