ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్‌కప్: పాక్ కెప్టెన్ ఎంపిక నేడే!
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో ఆడే పాకిస్థాన్ జట్టుకు ఎవరు కెప్టెన్సీ సారథ్యం వహిస్తారనే అంశంపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఇందులో భాగంగా ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టుకు సమర్థవంతుడైన నాయకుడిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేస్తుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లను మాజీ క్రికెటర్లు ప్రతిపాదించగా, ఈ అంశంపై పీసీబీ లేదా జాతీయ సెలక్షన్ కమిటీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతో అల్లాడుతున్న పాక్ క్రికెట్ జట్టును సమర్థంగా నడిపించగల సత్తావున్న ఆటగాడి కోసం పీసీబీ వెతుకులాటను ఎప్పటి నుంచో ప్రారంభించింది. కానీ ట్వంటీ-20 కెప్టెన్ ఎవరనే విషయాన్ని పీసీబీ మంగళవారం అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే.. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే పాకిస్తాన్ ‘ఎ’ జట్టుకు మహమ్మద్ హఫీజ్‌ను, అండర్-19 జట్టుకు అజీమ్ గుమ్‌నామ్‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పాకిస్థాన్ దినోత్సవం సందర్భంగా మంగళవారం గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్‌ని కూడా నిర్వహించనున్నారు. అదే సమయంలో ట్వంటీ-20 జట్టుకు కెప్టెన్‌ను కూడా ప్రకటిస్తారని పీసీబీ వర్గాల సమాచారం.