అరుణ్ జైట్లీ విచారణ: రవీంద్ర జడేజాపై నిషేధం ఎత్తివేత..!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ మ్యాచ్‌ల్లో ఆడేందుకుగాను రవీంద్ర జడేజాపై విధించే నిషేధాన్ని ఎత్తి వేయనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. జడేజా వివాదంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ త్వరితగతిన విచారణ జరుపనున్నట్లు తెలిసింది. దీంతో జడేజాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ రెండో సీజన్‌లో ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒప్పంద కాలాన్ని ఆ జట్టు నిర్వాహకులు పొడిగించలేదు. దీంతో రవీంద్ర జడేజా బీసీసీఐ అనుమతి లేకుండా, వేరొక ఐపీఎల్ జట్టు యాజమాన్యంతో ఒప్పంద విషయమై చర్చలు జరిపాడు. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో కొనసాగుతోన్న ఆటగాడు వేరొక జట్టుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించడం కుదరదు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం రవీంద్ర జడేజాపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ నిషేధంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, ఐపీఎల్ నిర్వాహ అధికారులకు రాసిన లేఖలో ముంబై ఇండియన్స్ ప్రమేయంతో జడేజా ఐపీఎల్ నిబంధనలను ఉల్లఘించాడని సమర్థించింది. కానీ ఈ అంశంపై జరిపిన విచారణ ఐపీఎల్ బృందం.. రవీంద్ర జడేజాకు, ముంబై ఇండియన్స్‌కు గల సంబంధం విచారణ జరిపి 25వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అరుణ్ జైట్లీని కోరింది. ఐపీఎల్ విజ్ఞప్తి మేరకు అరుణ్ జైట్లీ రవీంద్ర జడేజా వివాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.