Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటే అతడికి ప్రాణం... అదే అతడి ప్రాణం తీసింది...

ఆటే అతడికి ప్రాణం... అదే అతడి ప్రాణం తీసింది...
, గురువారం, 27 నవంబరు 2014 (19:42 IST)
క్రికెట్ చరిత్రలో నవంబరు 27న మరో విషాదం... దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఆస్ట్రేలియాకు చెందిన మరో అంతర్జాతీయ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియా తరపున ఆడే  జట్టు- ఎ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు హ్యూస్‌పైనే ఉంది. మూడు రోజుల క్రితం తలకి తగిన బౌన్సర్ బంతితో కుప్పకూలిపోయి కోమాలోకి వెళ్లిన హ్యూస్ గురువారం ఉదయం కన్నుమూసినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అతని మరణవార్తతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఇలా జరగడంతో అందరూ ఈ ఉదంతంపైనే చర్చించుకుంటున్నారు. హ్యూస్ అనామక క్రికెటర్ అయితే ఈ స్థాయిలో చర్చ ఉండేది కాదు. కానీ, అతడు ప్రతిభావంతుడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కుడు హ్యూసే కావడం గమనార్హం. అది అతనికి రెండో టెస్టు మాత్రమే. 2009లో దక్షిణాఫ్రికాపై ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించగా, అప్పటికి హ్యూస్ వయసు 20 ఏళ్లే.
 
కెరీర్‌లో 26 టెస్టులు ఆడిన హ్యూస్ 32.65 సగటుతో 2866 పరుగులు సాధించాడు. వాటిలో 3 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు ఉన్నాయి. 25 వన్డేల్లో 1100 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేట్ 75.09 శాతంగా ఉంది. వన్డేల్లో 2 సెంచరీలు, 4 ఫిఫ్టీలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఓసారి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు కూడా. ఇక, ఆస్ట్రేలియా-ఎ జట్టుకు ఆడుతూ దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై 202 (నాటౌట్) పరుగులు చేశాడు. అది వన్డే మ్యాచ్, పైగా హ్యూస్ సాధించింది డబుల్ సెంచరీ కావడంతో అప్పట్లో అతని పేరు మార్మోగిపోయింది. 
 
ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన హ్యూస్ వాస్తవానికి బౌన్సర్లను ఎదుర్కోవడంలో దిట్ట. కానీ, బంతి గమనాన్ని అంచనా వేయడంలో చిన్న పొరబాటు అతని ప్రాణాలను బలిగొంది. 25 వయసుకే అతని క్రికెట్ ప్రస్థానం, జీవితం రెండూ విషాదకర పరిస్థితుల్లో ముగిశాయి. అతని మృతి పట్ల క్రికెటర్లతో పాటు... ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ ఆబాట్ కూడా సంతాపం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu