రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి గురైన లలిత్ మోడీ... 2013 వరకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్‌గా కొనసాగుతారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చేశాడు. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల ఫలితాల ప్రభావం ఆయన బీసీసీఐ పదవులపై ఉండదని ఆయన ప్రకటించాడు.
కాగా, మోడీ ఐపీఎల్ కమీషనర్‌గానే కాకుండా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ విషయమై శశాంక్ మాట్లాడుతూ... ఈ రెండు పదవులకు.. తాజా ఎన్నికల ఫలితాలకూ ఎలాంటి సంబంధమూ లేదని వివరించాడు. ఆదివారం జరిగిన రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ చేతిలో మోడీ 18-13 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే... బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా మోడీ 2008లో ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మరో మూడేళ్లపాటు కొనసాగుతారు. అలాగే, ఐపీఎల్ కమిషనర్‌గా కూడా ఆయన పదవీకాలం 2013 వరకు ఉంది. ఈ మేరకు శశాంక్ మాట్లాడుతూ... ఇకపై కూడా లలిత్ మోడీ బీసీసీఐ అన్ని సమావేశాలకు హాజరవుతారనీ, అయితే రాజస్థాన్ క్రికెట్ సంఘానికి మాత్రం ఆయన ప్రాతినిధ్యం ఉండబోదని తెలియజేశారు.