శ్రీలంక క్రికెట్ జట్టుపై మంగళవారం లాహోర్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో.. భారత ఉపఖండంలో జరగాల్సిన 2011 ప్రపంచకప్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని లాహోర్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద దాడిలో ఆరుగురు శ్రీలంక క్రికెటర్లకు స్వల్పగాయాలయ్యాయి.
ఈ దాడిలో వారికి రక్షణగా ఉన్న ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. తాజా పరిణామాల ప్రభావం భారత ఉపఖండంలో జరగాల్సిన ప్రపంచకప్‌పై కూడా పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2011 ప్రపంచకప్ ప్రణాళికలపై రాబోయే 48 గంటల్లో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడిని ఐసీసీ ఖండించింది. మొత్తం క్రికెట్ కుటుంబానికే ఇది విచారకరమని వ్యాఖ్యానించింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రహూన్ లోర్గాత్ వచ్చే ప్రపంచకప్ ప్రణాళికలను సమీక్షించేందుకు ఐసీసీ సమావేశం అవుతుందని తెలిపారు. దీనిపై రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.