తమ జట్టుకు కదలికలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఎవరైనా తీవ్రవాదులకు చేరవేసి ఉంటారేమోనని.. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సందేహం వ్యక్తం చేశాడు. అంత ఖచ్చితమైన టైమింగ్‌తో వారు దాడి చేశారంటే, తమ ప్రయాణ సమయం, భద్రతా ఏర్పాట్లపై ఎవరో లోపలి వ్యక్తులే వారికి ఉప్పందించి ఉంచారని అన్నాడు.
లాహోర్‌నుంచి సురక్షితంగా మాతృభూమిపై అడుగుపెట్టిన అనంతరం ముత్తయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... బస్సులో తుపాకులున్న పోలీసులెవరూ లేరనీ, ఎవరి దగ్గరైనా తుపాకీ ఉండినట్లయితే, తమను తాము రక్షించుకునేందుకు అవకాశం ఉండి ఉండేదని వాపోయాడు.
తాము బయల్దేరిన అనంతరం పాకిస్థాన్ జట్టు స్టేడియంకు బయలుదేరిందనీ, ఇలా రెండు జట్లూ వేర్వేరు సమయాల్లో బయలుదేరుతున్నాయనే సమాచారం కూడా తీవ్రవాదులకు అంది ఉంటుందనీ ముత్తయ్య అనుమానంగా అన్నాడు. ముందుగా తీవ్రవాదులు డ్రైవర్‌ను కాల్చేందుకు ప్రయత్నించారనీ, ఆ తరువాత బస్సుకు ఇరువైపులా కాల్చారనీ, బస్సుకు 39 రంధ్రాలు కనిపించాయని మురళీ చెప్పాడు.
ఒకవైపు తుపాకులు పేలుతూనే ఉండగా... మరో వైపు పరనవితన ఛాతి నుంచి రక్తం కారడం చూశాను, అతడు చనిపోయాడనే అనుకున్నానని మురళీ గద్గద స్వరంతో పేర్కొన్నాడు. ఇక.. సమరవీర, సంగక్కరలకు కూడా రక్తస్రావమైందనీ, ఎక్కడ చూసినా రక్తమే కనిపిస్తుండటంతో భయంతో వణికిపోయానని మురళీ వివరించాడు.