పాకిస్థాన్ వెళ్లవద్దంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ లెక్కచేయకుండా.. ఇక్కడికి వచ్చి ముష్కరుల దాడికి గురైనందుకు శ్రీలంక క్రికెట్ జట్టుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్లు.. ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. లంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేయడం పాకిస్థాన్ క్రీడా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై ఇమ్రాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... లంక క్రికెటర్లకు భద్రత కల్పించడంలో పాక్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైయిందని, ఈ మేరకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. భద్రతా ఏర్పాట్ల విషయమై లంక జట్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం దారుణంగా విఫలమైందని, ఇది దేశానికే సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించాడు.
ఎక్కడపడితే అక్కడ భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయనీ... ఇందుకు పంజాబ్ (పాక్) గవర్నర్ నుంచి పోలీసు అధికారుల దాగా అందరూ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఆవేశంగా అన్నాడు. లేకపోతే, విదేశంలో పర్యటిస్తోన్న ఒక అంతర్జాతీయ బృందంపై దుండగులు బహిరంగంగా కాల్పులు ఎలా జరుపగలిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సాధారణంగా టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ సైన్యంపైనో, అమెరికా సైన్యంపైనో లేదా నాటో దళాలపైనో ప్రతీకార చర్యలుగా జరుగుతుంటాయని... అయితే మంగళవారం లాహోర్‌లోజరిగిన దాడి మాత్రం తమ దేశాన్ని అస్థిరపరిచే చర్యల్లో భాగంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది ఇమ్రాన్ సందేహం వ్యక్తం చేశాడు. ముంబయి దాడుల వెనుక ఉద్దేశ్యం కూడా ఇదేనని అన్నాడు.
అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికే దుండగులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఆరోపించాడు. 2011 వరల్డ్ కప్ భవిష్టత్తు గురించి ఇప్పుడే చెప్పడం కష్టమని ఇమ్రాన్ అన్నాడు.