Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీరు నిష్క్రమణ: ధోనీ ఘన కార్యమేనా!

వీరు నిష్క్రమణ: ధోనీ ఘన కార్యమేనా!
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మధ్య విభేదాలు ఉన్నట్లు ఇప్పటికే మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని, జట్టు సభ్యులంతా ఐక్యంగా ఉన్నారని ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడేముందు ధోనీ జట్టు సభ్యులందరితో కలిసికట్టుగా మీడియా సమావేశానికి వచ్చిమరీ నిరూపించాడు.

ధోనీ అంతా బాగానే ఉందని చెప్పినా.. ఏదో మూలన సంశయం. తాజాగా ప్రపంచకప్ మొత్తం మ్యాచ్‌లకు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా వైదొలగడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ధోనీ- వీరు మధ్య విభేదాలు మరింత ఎక్కువైనట్లు ప్రచారం మొదలైంది. సెహ్వాగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌కు పూర్తిగా దూరమయ్యాడని తెలిసిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో ధోనీ ప్రదర్శించిన అసహనం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

సెహ్వాగ్ గాయం గురించి తెలుసు. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే బీసీసీఐని అడిగి తెలుసుకోండి. వీరు గురించి ఏం మాట్లాడమంటారు.. ఇవి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ధోనీ ఇచ్చిన సూటి సమాధానాలు. ధోనీ చెబుతున్న సమాధానాల్లో అయిష్టత స్పష్టంగా తెలియడంతో మీడియా సమావేశం వాడివేడిగా సాగింది.

ఐపీఎల్ సమయంలోనే గాయమైనా వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటివరకు దాచిపెట్టడంపై ధోనీ అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. సహజంగా ప్రశాంతంగా ఉండే ధోనీ ఇటీవల కాలంలో సెహ్వాగ్ పేరెత్తితేనే సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. వీరు ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలేమైనా ఉంటే వాటిని బీసీసీఐని అడిగి తెలుసుకోవాలని తాజా సమావేశంలో ధోనీ సూచించాడు.

మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా భుజం గాయం కారణంగా ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అనుభవజ్ఞుడైన సెహ్వాగ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడం టీం ఇండియాకు ఎదురుదెబ్బే. వార్మప్ మ్యాచ్‌లు, ఆ తరువాత జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్ పాత్రలో రాణించినప్పటికీ.. ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రయాణం మొదలుపెట్టిన ఈ ముంబయి ఆటగాడు "సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్‌"ను మరిపిస్తాడా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Share this Story:

Follow Webdunia telugu