మంగళవారం ఉదయం పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన కాల్పులు 2011 ప్రపంచకప్ టోర్నీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ నిరంజన్ షా ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై షా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాల్పుల సంఘటన ప్రపంచకప్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనీ, ఇందులో ఎలాంటి సందేహానికీ తావు లేదని వ్యాఖ్యానించాడు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి గురించి తెలిసిన టీం ఇండియా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారని షా వెల్లడించాడు.
ఇకపోతే... ముంబయి దాడుల నేపథ్యంలో టీం ఇండియా పాక్ పర్యటన రద్దుకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వ నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు నిరంజన్ షా తెలిపాడు. కాగా, 2011 ప్రపంచకప్‌కు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు సహ ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే...లంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడిని, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఈ మేరకు భారత విదేశాంగ సహాయమంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. ఆ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతోనే టీం ఇండియాను పాక్ పర్యటనకు అనుమతించలేదని పేర్కొన్నారు.