వచ్చే 2011లో భారత ఉపఖండంలో జరుగున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు పాకిస్థాన్‌ను దూరం చేస్తే స్వదేశంలో మరిన్ని పోటీలను నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2011 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెల్సిందే.
అయితే లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడులు జరిపిన నేపథ్యంలో పాక్‌లో జరగాల్సిన ప్రపంచ కప్ పోటీల నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొన్ని అదనపు మ్యాచ్‌ల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే ఈ సమస్య అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కోర్టులో ఉందని, దీనిపై అన్ని దేశాల సభ్యులతో చర్చలు జరపాల్సి వుందని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహన్ నాగ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు.
అదనపు మ్యాచ్‌ల నిర్వహణకు భారత్ సర్వదా సిద్ధం. ఇందులో ఎలాంటి సమస్యా లేదు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహించేందుకు పాక్ కూడా సన్నద్ధం కావాలని ఆశిస్తున్నా. అయితే, పరిస్థితుల్లో మార్పులు రాకుంటే దానికి చేసేదేమి ఉండబోదన్నారు. ఇదిలావుండగా, గత యేడాది పాక్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్ ట్రోఫీని కూడా ఐసిసి వాయిదా వేసిన విషయం తెల్సిందే.