పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించలేమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. భద్రతా ఏర్పాట్లను గణనీయంగా మెరుగుపరచుకోకుంటే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమనే విషయం తేటతెల్లమవుతోందన్నారు. మంగళవారం లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడులు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ పోటీ ఒక్కటైనా అక్కడ జరగాలంటే పరిస్థితులు పూర్తిగా చక్కబడాలి. నా అభిప్రాయంలో అధికార యంత్రాంగం మారాలి అని అన్నారు.
పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌తో చర్చించినట్టు చెప్పారు. అలాగే, ఐసిసి ఉపాధ్యక్షుడు శరద్ పవార్‌తో కూడా చర్చించామన్నారు. తమ సంభాషణల్లో వచ్చే వారం భేటీ అయ్యేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
అయితే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పోటీల యుగం ముగిసిందని తాను చెప్పలేనన్నారు. 2011 ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, కేంద్ర మంత్రి శరద్ పవార్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.