పాకిస్థాన్... పర్యటించకూడని ఒక దేశంగా మాజీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఛాంపియన్ షేన్ వార్న్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. క్రీడాకారులు, అధికారులకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించడమనేది కీలకమైన విషయనే ఉద్దేశ్యంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మెల్బోర్న్‌లో విలేకరుల సమావేశంలో వార్న్ మాట్లాడుతూ, ఈ సంఘటన గురించి వినగానే తాను నమ్మలేకపోయానన్నాడు. ఇది ముమ్మాటికీ అత్యంత విచారకమైన విషయంగా పేర్కొన్నాడు. ఈ సంఘటనలో పౌరులు మృతి చెందారు మరియు అదే సమయంలో గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు అందరూ బాగానే ఉన్నారని భావిస్తున్నానన్నాడు.
దురదృష్టవశాత్తు, ఈ సంఘటనతో.. ఆసీస్ ఆటగాళ్లు సుధీర్ఘకాలం పాటు పాక్‌లో ఆడేందుకు విముఖత చూపే అవకాశాలున్నాయన్నాయన్నాడు. ఒక సాధారణ పౌరుడిగా ఇది తన అభిప్రాయమన్నాడు. కాగా, తగినంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేవరకు పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు లేదా మ్యాచ్‌లు నిర్వహించరాదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ ప్రకటించిన విషయం విదితమే.