ఏఫ్రిల్ నెలాఖరులో పాకిస్థాన్ జట్టుతో... దుబాయ్‌లో వన్డే సిరీస్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్స్ మాట్లాడుతూ... దుబాయ్‌లో పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్ యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశాడు.
ఈ విషయమై సదర్లాండ్స్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... విదేశాల్లో తాము ఆడే ప్రతి సిరీస్‌పై తాజా భద్రతా పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. పాక్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన... ప్రస్తుతానికి తాము దుబాయ్ పర్యటనను యథాతథంగా కొనసాగించే ఉద్దేశ్యంతోనే ఉన్నట్లు చెప్పాడు.
తక్కిన విషయాలను సిరీస్ ప్రారంభానికి ముందుగా పరిశీలిస్తామనీ.. తమ జట్టు వెళ్లే ప్రదేశం సురక్షితం కాదని తెలినట్లయితే.. గతంలో మాదిరిగానే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని సదర్లాండ్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే భారత ఉపఖండంలో జరగాల్సిన 2011 ప్రపంచకప్‌కు సంబంధించి ఇప్పుడే ఏదో ఒకటి ఊహించడం తొందరపాటుతనం అవుతుందని అన్నాడు.
మంగళవారం ఉదయం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు సభ్యులను లక్ష్యంగా చేసుకొని లాహోర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద దాడిలో ఏడుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడి క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.