Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్‌పూర్ టెస్టు: కివీస్‌పై 1-0తేడాతో భారత్ ఘన విజయం!

నాగ్‌పూర్ టెస్టు: కివీస్‌పై 1-0తేడాతో భారత్ ఘన విజయం!
FILE
న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్‌లో జరిగిన కీలక చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ ఇండియా బౌలర్ల స్పిన్ మాయాజాలంతో కివీస్‌పై భారత్, ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో టెస్టు నాలుగో రోజైన మంగళవారం భారత స్పిన్ బౌలర్లు విజృంభించి కివీస్‌ను 175 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా కివీస్‌పై 11 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది.

24/1 స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భజ్జీ, ఓజా, సురేష్ రైనా, ఇషాంత్ శర్మలు విజృంభించడంతో నాలుగో రోజు టీ విరామానికి 5 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టు ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కుప్పకూలడంతో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా తడబడ్డారు.

ఈ క్రమంలో కివీస్ బ్యాట్స్‌మెన్లు మెక్‌కల్లమ్ (25), హాప్కిన్స్ (8), గుప్తిల్ (0), టైలర్ (29), రైడర్ (22), విలియమ్సన్ (8), వెట్టోరీ (13), సౌథీ (31), మార్టిన్ (0)లు వెంట వెంటనే పెవిలియన్ ముఖం పట్టారు. చివరికి మెక్ కే మాత్రం (20) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కివీస్ 51.2 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది.

ఫలితంగా మూడు టెస్టు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, భజ్జీ చెరో మూడేసి వికెట్లు సాధించగా, ఓజా, సురేష్ రైనాలు తలా రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీని చేజార్చుకున్న టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌ రాహుల్ ద్రావిడ్‌కు "మ్యాన్ ఆఫ్ మ్యాచ్" అవార్డు లభించగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును హర్భజన్ సింగ్ సొంతం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu