పాక్‌లో శ్రీలంక ఆటగాళ్లపై కాల్పులు జరిగిన నేపథ్యంలో.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తోన్న టీం ఇండియా ఆటగాళ్లకు అదనపు భద్రత కల్పించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్న భారత ఆటగాళ్లకు పటిష్ట భద్రత కల్పించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు భారత క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ నిరంజన్ షాతో ఈ విషయమై చర్చలు జరిపినట్లు, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహన్ నాగ్‌పూర్‌లో విలేకరులతో చెప్పారు. మంగళవారం ఉదయం లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లు మైదానానికి బయలుదేరిన బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ కాల్పుల్లో స్పిన్ మాంత్రికుడు మహేలా జయవర్ధనే, స్పిన్నర్ అజంతా మెండీస్‌లతో ఆరుగురు క్రికెటర్లు గాయపడిన విషయాన్ని శశాంక్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కారణంగా కివీస్ పర్యటిస్తున్న టీం ఇండియా ఆటగాళ్లకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శశాంక్ ఎత్తి చూపారు. లాహోర్‌లో క్రికెటర్లపై జరిగిన కాల్పుల ప్రభావం 2011లో జరిగే ప్రపంచ కప్‌పై చూపుతుందని, వచ్చే ఐదేళ్ల వరకు భారత్.. పాక్‌లో పర్యటించే ప్రసక్తే లేదని శశాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. రాబోయే ప్రపంచకప్ కోసం పాక్ ఆతిథ్యాన్ని స్వీకరించేది లేదనీ.. అక్కడ టోర్నీ మ్యాచ్‌లు ఏవీ జరిపేది లేదనీ... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ మంగళవారం స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ విషయమై మోర్గాన్ మాట్లాడుతూ... శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన దాడి నేపథ్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఆటగాళ్లకు రక్షణ కల్పించటంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున ప్రపంచకప్ మ్యాచ్‌లను అక్కడ నిర్వహించకూడదని బలంగా నిర్ణయించినట్లు ఆయన తేల్చిచెప్పారు. అత్యంత ప్రమాదకరమైన ఆ దేశంలో ఇతర దేశ ఆటగాళ్ల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని ఈ సందర్భంగా మోర్గాన్ వాపోయారు.