Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంగారుపెట్టిన న్యూజిలాండ్: భారత్‌దే గెలుపు

కంగారుపెట్టిన న్యూజిలాండ్: భారత్‌దే గెలుపు
క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మూడో వన్డేలో భారీ లక్ష్యాన్ని ముందుంచినా టీం ఇండియాకు కివీస్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడటంతో.. భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే మిడిల్ ఆర్డర్‌లోని వికెట్లన్నీ వెంటవెంటనే పతనం అవడం ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు శాపంగా మారింది. ఫలితంగా పర్యాటక జట్టుపై న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీం ఇండియా ఆధిక్యత 2-0కి పెరిగింది. భారత్ ముందుంచిన 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.1 ఓవర్లలో 334 పరుగులు చేసి వికెట్లన్నీ చేజార్చుకుంది. ఓపెనర్లు బ్రెండన్ మెక్‌కలమ్ (6 ఫోర్లు, 3 సిక్స్‌లు 71), రైడర్ (105, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు 22 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

వీరిద్దరి శుభారంభాన్ని అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ సద్వినియోగపరచలేకపోయారు. మెక్‌కలమ్, రైడర్‌ల దూకుడుకు కళ్లెం వేసేందుకు ఓ దశలో భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిస్సహాయకులుగా మిగిలిన బౌలర్లకు మెక్‌కల్లమ్ 22వ ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఊరట లభించింది. అనంతరం వచ్చిన టేలర్ కూడా రనౌట్ అయ్యాడు.

దీంతో కివీస్ రెండో వికెట్ చేజార్చుకుంది. ఆ తరువాత కివీస్ మిడిల్ ఆర్డర్ నిలువునా కుప్పకూలడంతో టీం ఇండియా మ్యాచ్‌పై పట్టుబిగించింది. అయితే లోయర్ ఆర్డర్‌లో వచ్చిన మిల్స్ (54, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సౌథీ (32, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. వీరి దూకుడును చూసి, మరోసారి భారత బౌలర్లకు చెమటలు పట్టాయి. అయితే భారీ లక్ష్యం కావడంతో ఒత్తిడిలో వీరిరువురు కూడా వెనుదిరిగారు.

భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు, న్యూజిలాండ్‌లో తన సుదీర్ఘ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్ (163) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 392 పరుగులు చేసింది. ఓపెనర్ సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌‍లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. యువరాజ్ సింగ్, సచిన్ ఎదురుదాడికి ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. బౌలర్లపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన సచిన్, యూవీ తరువాత వచ్చిన వారికి భారీ స్కోరు సాధనను సులభసాధ్యం చేశారు.

133 బంతులు ఎదుర్కొన్న సచిన్ 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 163 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వన్డేల్లో 43వ సెంచరీ పూర్తి చేసుకున్న సచిన్‌తోపాటు, మిడిల్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) కూడా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో సురేష్ రైనా ఐదు సిక్స్‌లతో 38 పరుగులు జోడించి భారత్‌కు స్కోరును 400 పరుగులకు అతిచేరువ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu