టీమిండియా బ్యాట్స్‌మన్ తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరిగింది. రాజ్‌కోట్‌లో అతనికి అత్యవసర శస్త్రచికిత్స జరిగిందని, దీంతో అతను న్యూజిలాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
23 ఏళ్ల వర్మకు బుధవారం ఉదయం రాజ్‌కోట్‌లో అల్పాహారం తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. నిరంజన్ షా స్టేడియం గ్రౌండ్ సిలో జమ్మూ కాశ్మీర్‌తో హైదరాబాద్ తమ చివరి విజయ్ హజారే ట్రోఫీ లీగ్-దశ మ్యాచ్ ఆడటానికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరిగింది.
అనంతరం వర్మను ఆసుపత్రికి తరలించగా, అక్కడ స్కానింగ్‌లలో అతనికి అత్యవసర ఆపరేషన్ అవసరమని తేలింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వైద్య బృందంతో సంప్రదించి, వర్మకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు సమాచారం.