Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ దూకుడొద్దు.. ధోనీని చూసి నేర్చుకో : స్టీవ్ వా సలహా

కోహ్లీ దూకుడొద్దు.. ధోనీని చూసి నేర్చుకో : స్టీవ్ వా సలహా
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:26 IST)
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీలో పాఠాలు నేర్చుకోవాలని విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా హితవు పలికాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసునని అన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలగిన తర్వాత టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా అతని స్థానంలో కోహ్లీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 
 
వన్డే, టి-20 ఫార్మెట్స్‌లో ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మైదానంలో ధోనీ ఎలాంటి ఉద్వేగాలకు లోనుకాకుండా ‘మిస్టర్ కూల్’ అని పేరు తెచ్చుకోగా, దూకుడుగా వ్యవహరించడం కోహ్లీ అలవాటు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కయ్యానికి కాలుదువ్వడం, వివాదాల్లో చిక్కుకోవడం అతని బలహీనతలుగా మారాయి. ఇదే విషయాన్ని స్టీవ్ వా ప్రస్తావిస్తూ, ఉద్వేగాలను కోహ్లీ అదుపు చేసుకోవాలని హితవు పలికాడు. 
 
లారెస్ క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన స్టీవ్ వా మాట్లాడుతూ కోహ్లీని ప్రతిభావంతుడైన ఆటగాడిగా ప్రశంసించాడు. అయితే, కెప్టెన్సీ లక్షణాలను అతను ధోనీ నుంచి నేర్చుకోవాలని సూచించాడు. జనాలు ఏంటున్నారో ధోనీ ఎప్పుడూ పట్టించుకోడని, నిబద్ధతతో తనకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడని తెలిపాడు. 
 
మీడియాలో వచ్చిన వార్తలు లేదా విలేఖరులు వేసే ప్రశ్నలకు కోహ్లీ తీవ్రంగా స్పందించడాన్ని అతను అన్యాపదేశంగా గుర్తుచేస్తూ, ఉద్రిక్తతలకు లోనుకాకపోవడం మంచి కెప్టెన్ లక్షణమన్నాడు. ఆస్ట్రేలియా యువ స్టాండ్ ఇన్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, కోహ్లీ మధ్య పోలిక లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కొన్ని అంశాల్లో స్మిత్, మరికొన్ని అంశాల్లో కోహ్లీ మెరుగ్గా ఉన్నారని అన్నాడు. ఎవరి పంథా వారిదని తెలిపాడు. ఇద్దరూ సమర్థులేనని, కెప్టెన్లుగా రాణిస్తారని జోస్యం చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu