Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్చి నుంచి మొదలై చంద్రయానం వరకూ...

చర్చి నుంచి మొదలై చంద్రయానం వరకూ...
, గురువారం, 23 అక్టోబరు 2008 (02:19 IST)
దాదాపు 45 సంవత్సరాల క్రితం శూన్యం నుంచి మొదలై... ప్రస్తుతం చంద్రలోక యాత్ర వరకు పరచుకున్న భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రకు దేశంలోని ఒక మారు మూల పల్లెలోని చర్చిలో బీజం పడిందంటే ఆశ్చర్యం వేస్తుంది మరి. పరిశోధనా స్టేషన్లకు, లేబోరేటరీలకు కడు దూరంగా కేరళలోని ఒక మారుమూల మత్స్యకారులు గ్రామమైన తుంబాలో ఉన్న పాత చర్చిలో భారతీయ అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైందంటే ఒళ్లు గగుర్పాటు వేస్తుంది.

చైనా చేతిలో 1962లో భారత సైనికబలగాలు పొందిన పరాభవ జ్వాలలు భారత జాతీయ నాయకత్వంలో సాంకేతిక జ్ఞానంపై కాంక్షలను పురికొల్పాయి. నాటి ప్రధాని జవహర్‌లాల్ మదిలోంచి పుట్టుకొచ్చిన భావన అంతరిక్ష పరిశోధనకు భారతీయ జాతీయ కమిటీకి మొగ్గ తొడిగింది. ఇది 1962 నాటి మాట.
స్వప్న సాకార క్షణం...
  ఆ క్షణమే... భారతీయ అంతరిక్ష పరిశోధనలకు బీజం తొడిగింది. ఆ క్షణమే.. భారతీయ శాస్త్రజ్ఞుల స్వప్నాలకు సాకారమై నిలిచింది. ఆ ఘనతర క్షణమే... బిషప్ మాటలకు కిమ్మనకుండా సమ్మతించిన తుంబా గ్రామీణుల నిండు హృదయాల సాక్షిగా భారతీయ అంతరిక్ష ప్రస్థానం మొదలైంది.      


ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత అణు పితామహుడు హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ కలిసి దేశంలో రాకెట్ స్టేషన్ ఏర్పాటు కోసం ముందుగా కేరళలో పలు ప్రాంతాలలో అన్వేషించారు. చిట్టచివరకు వారి కన్ను తుంబాపై పడింది.

అనువైన స్థలం దొరికింది కానీ అక్కడా ఓ చిన్న అడ్డంకి. ఆ గ్రామంలో నివసిస్తున్న మత్స్యకారులు తాము పుట్టి పెరిగిన మట్టిపై భావోద్వేగాలను పెనవేసుకుని మరీ పెరిగారు. అందులోనూ గ్రామంలోని సెయింట్ మేరీ మాగ్డలీన్ చర్చి అంటే వారికి ప్రాణంతో సమానం. రాకెట్ కేంద్రం స్థాపనకు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం అంటే కష్టమైన పనే మరి.

అందుకే ఆ కష్టమైన పనికి తిరువనంతపురం మాజీ బిషప్ ఒకరిపై భారం పెట్టారు. ఒక ఆదివారం చర్చి సమావేశంలో ఆ బిషప్ గ్రామస్తులను సమావేశపర్చి అంతరిక్ష కార్యక్రమం ప్రయోజనాలను విడమర్చి చెప్పారు. తర్వాత, తుంబా గ్రామాన్ని భారత అంతరిక్ష శాఖకు స్వాధీనపరిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవుగా అని అడిగారు.

ఒక్క క్షణం గ్రామస్తుల హృదయాల్లో లక్ష భావాలు, సందేహాలు. అంతరిక్ష కార్యక్రమం గురించి బిషప్ చెప్పిన మాటలు మనసులలో కదులాడింది. ఒకే ఒక్క క్షణం జాప్యం. ఒక్కసారిగా ఊపిరి తీసుకుని గ్రామస్తులంతా 'ఆమెన్' అన్నారు.

అంతే... ఆ క్షణమే... భారతీయ అంతరిక్ష పరిశోధనలకు బీజం తొడిగింది. ఆ క్షణమే.. భారతీయ శాస్త్రజ్ఞుల స్వప్నాలకు సాకారమై నిలిచింది. ఆ ఘనతర క్షణమే... బిషప్ మాటలకు కిమ్మనకుండా తలవంచి సమ్మతించిన తుంబా గ్రామీణుల నిండు హృదయాల సాక్షిగా భారతీయ అంతరిక్ష ప్రస్థానం మొదలైంది.

భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి అదొక మంగళపదమైన ప్రారంభంగా రోదసీ నిపుణులు తర్వాత వ్యాఖ్యానించారు. తుంబా గ్రామం నుంచి తమ నివాస ప్రాంతాలను వేరే చోటికి మార్చుకున్న గ్రామీణుల ఆశీర్వాదం సాక్షిగా భారత అంతరిక్ష ప్రాజెక్టు మొగ్గ తొడిగింది.

webdunia
ఒకప్పుడు అతి చిన్న ప్రార్థనా స్థలంగా ఉన్న ప్రాంతం తర్వాత ఎపిజె అబ్దుల్ కలాంతో సహా పలువురు భారతీయ రాకెట్ శాస్త్రజ్ఞుల ప్రధాన నిలయంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అంతరిక్ష మ్యూజియంగా ఉన్న ఈ చర్చిలోనే తొలినాటి భారతీయ రాకెట్లకు సంబంధించిన నమూనాలు ప్రాణం పోసుకున్నాయి.
స్వప్న సాకార క్షణం...
  చంద్రయానంపై భారతీయ స్వప్నం ఏమంత తేలిగ్గా సాగలేదు. ఏది ఏమైనా తుంబా గ్రామీణులు, శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమానికి పురుడు పోసిన ఆ చిన్ని చర్చిని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. జాతి మొత్తం కూడా వారితో పాటే మరి..      


అయితే తొలినాళ్లలో పరిస్థితులు దుర్భరంగానే ఉండేవని చెప్పాలి. రోదసీ శాస్త్రజ్ఞులు ప్రతిరోజూ తిరువనంతపురం నుంచి రద్దీగా ఉన్న బస్సుల్లో తుంబా కేంద్రానికి ప్రయాణించవలసి వచ్చేది. రైల్వే స్టేషన్‌లో ఆహారం కొనుక్కుని మరీ ఆ మారుమూల ప్రాంతానికి చేరుకునేవారు.

అతి త్వరలోనే తుంబా గ్రామం తుంబా ఈక్విటేరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌గా మారింది. మొట్టమొదటి సౌండింగ్ రాకెట్‌ను 1963 నవంబర్‌లో ప్రయోగించారు. నైక్ అపాచే అనే పేరుగల ఈ రాకెట్‌ను నాసా అందించింది. అప్పటినుంచి వాతావరణాన్ని అధ్యయనం చేసే పలు సౌండింగ్ రాకెట్లు తుంబా నుంచి ప్రయోగించబడ్డాయి.

చివరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు చెందిన రాకెట్లు కూడా ఇక్కడినుంచి ప్రయోగించారు. మొదట్లో అనేక రాకెట్ విడిభాగాలను శాస్త్రజ్ఞులు సైకిళ్లపై పెట్టుకుని తుంబాలో ఒకచోటినుంచి మరో చోటికి తీసుకెళ్లేవారు. ఇప్పుడైతే ప్రతి వారం సౌండింగ్ రాకెట్లు తుంబానుంచి ప్రయోగించబడుతుంటాయి. ఎట్టకేలకు తుంబా రాకెట్ కేంద్రం అధునాతన స్టేషన్‌గా మారిపోయింది.

తొలినాళ్లలో సౌండింగ్ రాకెట్ కార్యక్రమ విజయంతో ప్రభావితుడైన సారాభాయి, భారత్ తన స్వంత ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని తన టీమ్‌తో చెప్పారు. స్వంతంగా దేశం ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మరో ప్రయోగ కేంద్రం కావాలి. గగనతల అన్వేషణలో భాగంగా విక్రమ్ సారాభాయ్ ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట పరిసరాలను చూసి అబ్బుర పడ్డారు.

చుట్టూ సముద్రం దట్టమైన అడవి.. దానికి తోడు యానాదుల నివాస స్థలంగా ఉన్న శ్రీహరికోట ఆ క్షణం నుంచే తన నడకను మార్చుకుంది. యానాదులు స్థానిక ప్రజల మద్దతుతో శ్రీహరికోటలో భారతీయ ఉపగ్రహ కేంద్రానికి పునాది రాయి పడింది. తరువాత నడిచిందల్లా చరిత్ర క్రమమే..

చంద్రయానంపై భారతీయ స్వప్నం ఏమంత తేలిగ్గా సాగలేదు. ఏది ఏమైనా తుంబా గ్రామీణులు, శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమానికి పురుడు పోసిన ఆ చిన్ని చర్చిని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. జాతి మొత్తం కూడా వారితో పాటే మరి..

Share this Story:

Follow Webdunia telugu