Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-1పై బ్రిటీష్ శాస్త్రవేత్త ఎదురుచూపు

చంద్రయాన్-1పై బ్రిటీష్ శాస్త్రవేత్త ఎదురుచూపు
, మంగళవారం, 21 అక్టోబరు 2008 (12:52 IST)
చంద్రయాన్-1 ప్రయోగంపై భారత్ యావత్తు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న సమయంలో ఓ బ్రిటీష్ సైంటిస్ట్ సైతం ఈ ప్రయోగం ఎలా జరగనుందో అంటూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. భారత్ తొలిసారిగా చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంపై భారతీయులకు ఉత్కంఠ ఉండడం సహజమే. మరి ఈ ప్రయోగంపై ఆ బ్రిటీష్ శాస్త్రవేత్తకు ఆసక్తి ఎందుకు కలిగిందంటే...

మాన్యేల్ గ్రాండే అనే ఈ బ్రిటీష్ శాస్త్రవేత్త రూపొందించిన ఓ కెమెరాను చంద్రయాన్-1 ఉపగ్రహంతో సహా పంపనున్నారు. ఉపగ్రహంతో పాటు పంపనున్న ఈ కెమెరా చంద్రుని ఉపరితలాన్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీయనుంది. తాను రూపొందించిన కెమెరా అంతరిక్షంలో ఎలా పని చేయనుందో తెలియాలంటే ఆ శాస్త్రవేత్తకు మన చంద్రయాన్-1 విజయవంతంగా చంద్రునివద్దకు దూసుకెళ్లాలి కదా...

అందుకే ఈ ప్రయోగంపై సదరు బ్రిటీష్ శాస్త్రవేత్త అంతగా ఆసక్తి కనబరుస్తున్నారు మరి. అక్టోబర్ 22న శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై బ్రిటీష్ శాస్త్రవేత్త అయిన గ్రాండే మాట్లాడుతూ ఈ ప్రయోగం చాలా గొప్పదనీ... దీని కోసమే తాను ప్రత్యేకంగా కెమెరాను రూపొందించడం జరిగిందని తెలిపారు.

భారత్‌లో జరగనున్న ఈ చంద్రయాన్-1 ప్రయోగాన్ని స్వయంగా తిలకించేందుకై అక్కడికి చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఆ శాస్త్రవేత్త ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం వేల్స్‌లో ఉన్న ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గ్రాండే ఈ రకమైన అంతరిక్ష ప్రయోగ కెమెరాలు రూపొందించడంలో సిద్ధహస్తుడు.

గతంలో 2003లో యూరోపియన్ స్పేస్ మిషన్ కోసం ఓ ప్రోటోటైప్ కెమెరాను ఈయన రూపొందించారు. ప్రస్తుతం చంద్రయాన్-1 కోసం రూపొందించబడిన ఈ కెమెరా చంద్రునిపై ఉన్న వివిధ రకాల మూలకాలను ఫోటోలు తీయడం ద్వారా వాటిని భూమిపై ఉన్న మూలకాలతో సరిచూసేందుకు తోడ్పడనుంది.

అంతేకాకుండా ఈ కెమెరా సాయంతో చంద్రుడు ఏ తరహా మూలకాలతో రూపొందాడనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా భూమిపై ఉన్న మూలకాలతో దాన్ని సరిపోల్చేందుకు ఉపయోగపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu