Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ స్పైస్ సదస్సులో కొడాలికి దక్కిన గౌరవం

తెలుగు శాస్త్రవేత్తకు లభించిన అరుదైన గౌరవం

ప్రపంచ స్పైస్ సదస్సులో కొడాలికి దక్కిన గౌరవం
, సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (16:34 IST)
FILE
ప్రపంచ స్పైస్‌ కాంగ్రెస్‌ సదస్సు ఈనెల 3 నుంచి 5 వరకు న్యూ ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి దాదాపు 400లకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో భారతదేశానికి చెందిన డాక్టర్ కొడాలి చంద్రశేఖరరావుతోపాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు వ్యవసాయ పద్ధతులతోపాటు కోనూరు మిరప రైతుల అనుభవాల గురించి ప్రతినిధులకు వివరించారు. తమ సూచనల మేరకు మిరప పంటను పండిస్తున్న రైతులు అధిక దిగుబడిని పొంది మిరప పంటతో లాభాలను ఆర్జిస్తున్నారని ఆయన తెలిపారు.

అగ్రికల్చరల్‌ అసోసియేట్స్‌ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ అగ్రికల్చర్‌ (ఆరా) పేరుతో తాము ఓ సంస్థను ఏర్పరచి చిన్న, సన్నకారు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని, గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపాన గల కోనూరు గ్రామంలోని రైతులు తమ (ఆరా) శాస్త్రవేత్తల సహకారంతో మిరపను సాగుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తక్కువ ఖర్చుతో పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులు సాధించేవిధంగా రైతులకు శిక్షణనిస్తున్నామన్నారు. మిరపలో ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తూ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న కోనూరు గ్రామ రైతులు, పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా ప్రపంచ స్పైస్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న పలువురు ప్రతినిధులు ప్రశంసించారు.
webdunia
FILE


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 40 బస్తాల ఎరువులు వాడే రైతులు తమ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులను పాటించి 4వ వంతు ఎరువులు మాత్రమే వాడారన్నారు. గతంలో 25 నుండి 30 సార్లు పురుగు మందులు పిచికారి చేసే రైతులు తమ శాస్త్రవేత్తల సూచనలతో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి కేవలం 10 సార్లు మాత్రమే సస్యరక్షణ మందులను అవసరం మేరకు పిచికారి చేశారని, దీంతో పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం తగ్గిందని ఆయన తెలిపారు.

గుంటూరు జిల్లాలోని గ్రామాలలోనున్న రైతులకు ప్రత్యేకంగా హరిత పాఠశాలలను స్థాపించి శిక్షణనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమగ్ర సస్య రక్షణపై అవగాహన కలిగిన పలువురు శాస్త్రవేత్తలు ఆరాలో సభ్యులుగానున్నారని వారిలో డాక్టర్. కొసరాజు చంద్రశేఖరరావు, డాక్టర్ రావిపాటి రవీంద్రబాబు, డాక్టర్. మండా శ్రీరాములు, డాక్టర్. తాజ్‌ బహదూర్‌ గౌర్‌‌లున్నారని ఆయన అన్నారు.

ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ప్రపంచ సుగంధ ద్రవ్యాల కాంగ్రెస్‌ సదస్సు నిర్వహిస్తుంటారు. మన దేశం నుండి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాల్లో 36 శాతం మిర్చి ఆక్రమిస్తోంది. ఇందులో 32 శాతం మిర్చి మన రాష్ట్రం నుండి ఎగుమతి అవుతుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, గుంటూరు, కష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిర్చి పంటను రైతులు అత్యధికంగా సాగుచేస్తుంటారు. మిరపకాయలు అధికంగా వాడటంతో క్యాన్సరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మిర్చి వినియోగం అధికమవుతోందని, దీనికి తమవంతు కృషి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోను యాజమాన్య పద్ధతులను పాటించి తక్కువ రసాయన ఎరువులు వాడి అధిక దిగుబడిని సాధించేలా మిరప రైతులకు తాము సూచనలు, సలహాలు అందించేందుకు సిద్ధంగానున్నామని ఆయన అన్నారు. దీనికిగాను తమ ఆరా సంస్థలోనున్న శాస్త్రవేత్తల బృందం నిరంతరం కృషి చేస్తుంటుందని ఆయన వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu