Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బడ్జెట్ 2010: జలయజ్ఞానికే పెద్దపీట

బడ్జెట్ 2010: జలయజ్ఞానికే పెద్దపీట
ఆర్థిక మంత్రిగా అవతారమెత్తిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన మార్కును ప్రతిబింభించేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్ కలలను సాఫల్యం చేసే దిశగా ఆయన బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జలయజ్ఞానికి ఎప్పటిలా పెద్ద పీట వేశారు.

మొత్తం 1,13,660 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన.. వృద్ధిరేటును 7.17గా చూపారు. వార్షిక బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయంగా రూ.7,03,347 కోట్లుగాను, ప్రణాళికా వ్యయాన్ని రూ.40,313 కోట్లుగా చూపించారు. రెవెన్యూ మిగులు రూ.62,702 కోట్లుగా చూపించారు. ఇకపోతే.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను రూ.14,505 కోట్లుగా పేర్కొన్నారు.

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ.13,441 కోట్లు అంచనా వేశారు. ద్రవ్య లోటును రూ.12,983 కోట్లుగాను, మూలధన వసూళ్ళను రూ.23,027 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. జలయజ్ఞానికి రూ.15,101 కోట్లు అంటే నీటిపారుదల శాఖకు రోశయ్య కేటాయించి పెద్దపీట వేశారు.

శనివారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని రోశయ్య ప్రారంభించారు. గత నాలుగేళ్ళలో రాష్ట్రం సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా పచ్చని పైర్లు, పంటలతో కళకళలాడిందన్నారు. గత సెప్టెంబరు నుంచి ప్రకృతి కన్నెర్ర జేయడంతో కరవు తాండవించిందన్నారు.

గత ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ దుర్మరణం పాలుకావడం రాష్ట్రానికే తీరని లోటుగా ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ప్రతి ఒక్కరినీ కలిసి వేసిందని, ముఖ్యంగా, తాను ఒక ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రోశయ్య సభలో కాంగ్రెస్ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల సంభవిస్తున్న ఆందోళకర పరిస్థితులు లేకపోతే రికార్డు స్థాయిలో అభివృద్ధి జరిగి ఉండేదని సీఎం గుర్తు చేశారు.

జలయజ్ఞంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు మూడింటికి జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నామన్నారు. వీటిలో రెండు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్రం నుంచి తీపి కబురు రావొచ్చని రోశయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. ఆరువేల కోట్ల రూపాయల వ్యయంతో చిత్తూరు జిల్లా మన్నవరంలో ఏర్పాటు చేసే విద్యుత్ పరికరాల పరిశ్రమకు త్వరలో ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. తమ ప్రభుత్వం ఎప్పటిలా ప్రజాసంక్షేమానికే కట్టుబడి ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య సభకు హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu