Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోపీ 'జలగీతం'లో నీటి విలాపం..

గోపీ 'జలగీతం'లో నీటి విలాపం..

Raju

, శుక్రవారం, 11 జులై 2008 (17:42 IST)
ప్రపంచంలో దేనికయినా విశ్రాంతి ఉంటుందేమో గాని నీటికి ఉండదు. ప్రకృతిలో అనుక్షణం మేల్కొని ఉండేది నీరు. ప్రతి గంట నీరు ఎక్కడో ఓ చోట కూడుతూనే ఉంటుంది... ప్రతి రుతువు నీటి రుతువే. ప్రపంచాన్ని నీళ్లు అప్రమత్తం చేస్తున్నాయని ప్రకటించు.. నీటికి ఆసన్న హస్తం అందించండి.. అందుకే జలగీతం శాశ్వతమైంది.. పవిత్రమైంది.. అంటున్నారు సుప్రసిద్ధ తెలుగు కవి ఎన్. గోపీ.

తెలుగులో 'జలగీతం' పేరిట గోపీ రచించిన కవితల సంపుటికి ఎమ్ శ్రీధర్ అల్లాడి ఉమలు చేసిన ఇంగ్లీషు అనువాదాన్ని హైదరాబాద్‌లోని అమెరికన్ స్టడీస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఇసాక్ సెక్వెరియా ఆవిష్కరించారు.
వైస్ ఛాన్సలర్ పదవీ భారం....
  వైస్ ఛాన్సలర్ పదవీ ఒత్తిళ్లనుంచి ఉపశమనం పొందాలనుకోవడం కూడా తాను కవిత్వం వ్రాయడానికి కారణమని ఎన్. గోపీ చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఉప కులపతిగా పని చేస్తున్నప్పుడు కూడా తాను కవిత్వం రాస్తూ వచ్చానని గోపీ తెలిపారు.      


ప్రకృతిని విధ్వంసం చేస్తూ జలవనరులను హరిస్తున్న మనిషిని ఇప్పటికైనా మేలుకోవాల్సిందిగా కవి గోపీ ఈ జలగీతం కవితల సంపుటి ద్వారా పిలుపునిచ్చారు. నీటిని పొదుపు చేయవలసిన తక్షణావసరం గురించి కవితాత్మకంగా సూచించిన 'జలగీతం' మనిషి దుర్వినియోగం కారణంగా ప్రపంచంలోని సరస్సులు, నదులు, సముద్రాలు, జలపాతాలు మనుగడ కోల్పోతూ పడుతున్న ఇక్కట్లను హృద్యంగమంగా వర్ణించింది.

ఈ సందర్భంగా ఎన్.గోపీ తన కవిత్వ నేపథ్యం గురించి కవితలు రాయడంలో తన అనుభవాల గురించి సభకు విచ్చేసిన వారితో పంచుకున్నారు. తాను ఎప్పుడు ఏది రాసినా తన సొంత జీవితానుభవాలనుంచే విషయాన్ని తీసుకుని రాస్తూ వచ్చానని గోపీ అన్నారు. మెట్ట ప్రాంతమైన నల్గొండ జిల్లానుంచి తాను వచ్చానని చిన్నతనంలో తన గ్రామమైన భోనగిర్ ప్రాంతంలో నీటికోసం ఊరికి చాలాదూరం పోయి మోసుకుంటూ వచ్చిన బాల్యస్మృతులను గోపీ ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.

గోపీ రాసిన జలగీతం... భూమ్మీద ఉన్న నదులు, సముద్రాలు, జలపాతాలు, సరస్సుల వ్యధల గురించి మానవీయ, పర్యావరణ దృక్పధంతో రూపొందింది. హుస్సేన్ సాగర్‌‌లో కాలుష్యం గురించి గోపీ రాసిన ఓ వాక్యం ఆ సరస్సుకు పట్టిన గతిని వర్ణిస్తుంది. బుద్దుడి చిరునవ్వులు కూడా హుస్సేన్ సాగర్ జలాల కాలుష్యం బారిన పడి మసకబారిపోయాయట.

అలాగే దాల్ సరస్సు, యమున, గంగ, బ్రహ్మపుత్ర నదుల కాలుష్యాన్ని కూడా గోపీ తన జలగీతంలో ప్రస్తావించారు. కొన్ని సార్లు దేశంలోని జల దుస్థితి గురించి వేడుకుంటున్న స్వరంతో కవి స్పందిస్తే, మరి కొన్ని సార్లు తీవ్ర స్వరంతో హెచ్చరిస్తారు. 'నీటికంటే వేగంగా పరుగెడుతున్న నాగరికతా... జాగ్రత్త నిగూఢ ప్రమాదాలు పొంచి ఉన్నాయ్..' అని ఓ కవితా పాదం హెచ్చరిస్తుంది.

కాగా, జలగీతం -వాటర్ సాంగ్- కవితా సంపుటిని ఆవిష్కరించిన ఇండో అమెరికన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్ ఇసాక్ సెక్వెయిరా ఈ పుస్తకాన్ని ఆంగ్లీకరించిన అనువాదకులను ప్రశంసించారు. జల ప్రాశస్త్యాన్ని, జల సంరంభాన్ని ప్రస్తుతించిన ఎన్ గోపీ జలగీతం వేదమంత్రాల్లో నీటి కోసం ప్రాచీనులు పఠించిన ప్రార్థనా శ్లోకంగా ఉందని ఇసాక్ అభివర్ణించారు.

కాగా, గోపీ రచించిన ఈ జలగీతం పుస్తకాన్ని, పుస్తక పఠనాన్ని పోయట్రీ సొసైటీ నిర్వహించింది.

Share this Story:

Follow Webdunia telugu