Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వధువు సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే...

వధువు సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే...
, బుధవారం, 27 జనవరి 2016 (11:22 IST)
పెళ్ళి… ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం. అలాంటి అపురూప క్షణాల్లో నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు భద్రంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే… మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున వధువులు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. కొద్దిపాటి మెళకునలు పాటిస్తే చాలు. అందం మీ స్వంతం. అందానికి అందం చేకూర్చడానికి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. కానీ పార్లర్లకు వెళ్ళడానికి సదుపాయం లేని వారు ఈ చిట్కాలను పాటిస్తే పార్లర్ అందం మీ వశమవుతుంది. 
 
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే మగువలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోసుకుంటే చాలు. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. అనవసరమైన విషయాలకు ఆందోళన చెందడం మానేయాలి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
 
నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి బాటిల్ ఉండాల్సిందే. ఎక్కడపడితే అక్కడి నీరు తాగనే కూడదు. మినరల్ వాటరైతే ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బొండాం తాగాలి. పండ్ల రసాలను సేవించడం ఇంకా మంచిది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతాకాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. 
 
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. వీటివల్ల తేడా వస్తే ఇంతవరకు పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu