Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్లక్ష్యం నీడలో "జవదు కొండలు"

నిర్లక్ష్యం నీడలో
ఒంటినిండా పచ్చరంగు చీర చుట్టుకుని, రారమ్మని కవ్వించే ప్రకృతి సౌందర్యం "జవదు కొండల" సొంతం. ప్రకృతి అందాలతో నిండి ఉండే ఈ కొండల సౌందర్యాన్ని తనివితీరా చూసి ఆస్వాదించాలంటే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు వెళ్లి తీరాల్సిందే..! చుట్టూ ఎత్తైన కొండలు, జలజల పారే సెలయేర్లు, చూసేంతదూరం పచ్చదనంతో స్వాగతం చెప్పే జవదు కొండల అందాన్ని వర్ణించేందుకు వీలుకాదు.

అయితే, ఇంతటి అందమైన వాతావరణాన్ని తమలో నింపుకున్న జవదు కొండలు నిర్యక్ష్యం నీడలో బూచులాడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ జవదు కొండల ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటకుల కోసం వినియోగించి, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచటంలో స్థానిక, జిల్లా యంత్రాంగాలు విఫలమయ్యాయని.. ప్రకృతి ప్రేమికులు విమర్శిస్తున్నారు.

పచ్చదనం, జలవరులు, ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను, సాహస క్రీడాకారులను ఆకర్షించే తూర్పుకనుమల్లో భాగమైన జవదు కొండలను పట్టించుకోక పోవడం వల్ల పర్యాటక రంగం నష్టపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, 35 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ కొండలు.. నగర జీవితం అందించలేని స్వచ్ఛమైన వాతావరణంతో ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి.

అంతేగాకుండా వాటి సమీపంలోని కూవెట్టేరీ సరస్సు, భీమా జలపాతం, కొండల దిగువన గల ప్రాంతంలోని ఆనకట్ట సమీపంలోని అమ్రీతీ జంతు ప్రదర్శన శాల, గ్లాస్ హౌస్, ఎత్తైన పర్వత శిఖరాలతో నిండిన ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నప్పటికీ పర్యాటక రంగంలో ఈ ప్రాంతానికి చోటు దక్కక పోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శమేనని ప్రకృతి ప్రేమికులు ఆరోపిస్తున్నారు.

అంతేగాకుండా, జవదు కొండల సమీపంలోని కవలూరు వద్ద నుండే ఆసియాకే పెద్దదైన అంతరిక్ష పరీక్షా కేంద్రం, వల్లిపారైలోని శతాబ్దాల క్రితం నాటి మానవ నివాస గుహలు... తదితరాలు కూడా దర్శనీయ ప్రాంతాలే కావడం గమనార్హం. వేసవిలో రెండు రోజులపాటు మొక్కుబడిగా చేసే సమ్మర్ ఫెస్టివల్ మినహాయించి, ఈ ప్రాంతానికి మరే ప్రాముఖ్యం లేకుండా గడచిపోతోంది.

తిరువణ్ణామలై, వేలూరు నగరాల నుంచి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉన్నప్పటికీ జవదు కొండల ప్రాంతం అధికారుల నిర్లక్ష్యానికి మరుగున పడిపోతోంది. సమ్మర్ ఫెస్టివల్ ఉత్సవాలు గత 13 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ, అవి జరుగుతున్నట్లు ఆ జిల్లా వాసులకే తెలియకపోవడాన్నే, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జవదు కొండలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu