Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!

అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!
నీలగిరి జిల్లా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే "బండిపూర్ పులుల సంరక్షణా కేంద్రం (డీటీఆర్)" అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న కారణంగా... ఈరోజు నుంచి ఈ కేంద్రం సమీపంలోని నీలగిరి-మైసూర్‌ల మధ్య ఉన్న జాతీయ రహదారి-67పై రాత్రి 10 గంటల తరువాత వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో... తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నడుమ మరో వివాదానికి దారితీసే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఎందుకంటే... నీలగిరి, కర్ణాటకలను కలుపుతూ ఉన్న ఏకైక రహదారి ఎన్‌హెచ్-67 మాత్రమే కాగా.. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది ప్రైవేటు, ప్రభుత్వ, టూరిస్ట్ వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి.

దీంతో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడు రాష్ట్ర పర్యాటక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపనుందని నీలగిరి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మార్గాన్ని మూసివేయాలనుకోవడం సబబు కాదని వారు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా, తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలంటూ నీలగిరి టూర్ ఆపరేటర్ల సంఘం విజ్ఞప్తి చేసింది.

అయితే చామరాజ జిల్లా కలెక్టర్ మనోజ్ కుమార్ మీనా మాట్లాడుతూ... పులుల సంరక్షణా కేంద్రంలో పులుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, కనీసం రాత్రిపూటనైనా పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే వాహనాల రాకపోకలను నిషేధించినట్లు చెబుతున్నారు.

అయితే రాత్రివేళల్లో కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వ బస్సులను మాత్రం అనుమతించినట్లు మీనా తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ విషయమై కర్ణాటక ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని నీలగిరి జిల్లా కలెక్టర్ ఆనంద్ పాటిల్ పేర్కొనడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu