Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహావిష్ణువు నారసింహుడిగా దర్శనమిచ్చే "అహోబిలం"

మహావిష్ణువు నారసింహుడిగా దర్శనమిచ్చే
FILE
హిరణ్యకశిపుడిని సంహరించిన శ్రీ మహా విష్ణువు "అహోబిలం" పుణ్యక్షేత్రంలో నారసింహుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆంధ్రప్ర్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డలో నెలకొన్న ఈ ఆలయం నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందిన అహోబిలంను "సింగవేల్ కుండ్రం" అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా కలదు.

శేష పర్వతంగా భావించే నల్లమల పర్వత సానువులను.. ఆదిశేషుని శిరోభాగం శృంగేరి, మధ్య భాగం వేదగిరి, అగ్రభాగం గరుడగిరిగా పెద్దలు చెబుతుంటారు. అందుకనే ప్రహ్లాదుని కరుణించిన ఈ స్వామివారిని దర్శిస్తే సకల అభీష్టాలు, శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది. పర్వతంపైనగల భాగాన్ని "ఎగువ అహోబిలమ"నీ, పర్వతం క్రింద ఉండే భాగాన్ని "దిగువ అహోబిలం" భక్తులు పిలుస్తుంటారు.

ఎగువ అహోబిలంలో అహోబలేశ్వర ఆలయం ఉంది. తొమ్మది కిలోమీటర్ల ఎత్తులో ఉండే పర్వతంపై ఈ ఆలయం నెలకొని ఉంది. దీంతో ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. గుండ్రని రాళ్ళతోనిండిన ఎగువ అహోబిలంలో ఎన్నో మండలాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో ఉన్న కోనేటిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఈ నీటిని ఆ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు తాగునీరుగా సరఫరా అవుతుంటుంది. అహోబలేశ్వర ఆలయంలోని స్వామివారికి అర్చన నిమిత్తం పెంచే పూల తోటల కోసం ప్రధానంగా ఈ నీటిని వాడుతుంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఈ ప్రాంతం హిరణ్యకశిపుడనే రాజు పరిపాలించిన ప్రాంతం. స్తంభాన్ని చీల్చుకుని భీకర రూపంలో నారసింహుడు దుష్టుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన దివ్య ప్రదేశం ఇదే.

ఎగువ అహోబిలంలోని అహోబలేశ్వర ఆలయం హంపి శిల్పకళా రీతిలో అలరారుతోంది. 1953 వరకు ఇక్కడ ఎన్నో చెంచు కుటుంబాలు నివాసం ఉండేవి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయ ప్రసాదాలను, భక్తులు తెచ్చిన వివిధ రకాల ఫలాలను నారసింహుడికి నివేదన చేస్తారు. నారసింహ జయంతిని, చెంచులక్ష్మితో ఆయన కళ్యాణాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున, అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఇక రెండోది దిగువ అహోబిలం. ఇక్కడ ప్రహ్లాద వరద నారసింహ ఆలయం ఉంది. విజయనగర రాజుల శిల్పశైలితో మూడు ప్రాకారాల మధ్యలో వెలసిన ఈ ఆలయం వీక్షుకుల్ని విశేషంగా ఆకట్టుకుని తన్మయత్వంలో ముంచెత్తుతుంది. ఆలయ సమీపంలోని ఆళ్వారు కోనేరు వద్ద ఎగువ, దిగువ అహోబిలాల ఆలయాల్లో పనిచేసే అర్చకులు నివాసం ఉంటారు. ఇక్కడ భక్తుల వసతికోసం ఎన్నో మండపాలను నిర్మించారు.

దిగువ అహోబిలంలో సహజ శిలలో నరసింహుడు కొలువైయున్నాడు. స్తంభాలపై అద్భుత శిల్పకళా సౌందర్యంతో దిగువ ఆలయంలో ముఖమండపం, ప్రధాన ఆలయం, రంగమండపం, కనువిందు చేస్తాయి. రంగమండపంలో గుర్రాలపై ఎక్కిఉన్న యక్షులు, విజయనగర శిల్పకళా వైభవంతో అలరారే వివిధ వాద్యకారులు, అతివలు, రామలక్ష్మణుల శిల్పాలు, నరసనాయక విగ్రహాలు శోభాయమానంగా కనిపిస్తాయి.

ఆలయ చరిత్రను చూస్తే.. నారసింహుడి రూపంలోని శ్రీ మహావిష్ణువు భీకర రూపాన్ని దర్శించిన దేవతలు "అహోబిలం, అహోబిలం" అంటూ స్వామివారిని కీర్తించారట. అదే విధంగా ఇక్కడ పెద్ద పెద్ద గుహలు ఉండటంవల్ల అహోబిలంగా కీర్తించబడింది. మరో కథ ప్రకారం.. శ్రీ మహావిష్ణువును నారసింహ రూపంలో చూడాలనే కోరికతో గరుడు తపస్సు చేశాడట. గరుడి తపస్సుకు మెచ్చిన స్వామివారు నారసింహ రూపాలతో 9 ఆలయాలలో కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ తొమ్మిది నారసింహ ఆలయాలన్నీ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. అవేంటంటే.. వరహ, మాలోల, యోగానంద, పావన, కారంచ, ఛత్రపట, భార్గవ, జ్వాలా, అహోబిల నారసింహ దేవాలయాలు. ఈ ఆలయాలలో కొన్నింటిని చేరుకోవాలంటే కొండలు ఎక్కాలి. మరి కొన్నింటిని గుహల్లోనూ, అతి కష్టంమీద పర్వతాలను ఎక్కి చేరుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆలయాల్లో ముఖ్యంగా పావన నరసింహ ఆలలో వివిధ రూపాల్లోగల స్వామి ఉగ్ర, శాంత, యోగ, కళ్యాణ మూర్తిగా విలసిల్లుతున్నాడు. హిరణ్యకశిపుని వధ అనంతరం శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించి నల్లమల అడవుల్లో ఉగ్రరూపంతో సంచరిస్తున్న నరహరిని వలచి వివాహమాడుతుంది. ఆ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో చెంచులక్ష్మితో నరసింహుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. మాలోల నరసింహుని ఆలయం కూడా గ్రామం దగ్గరలో ఉంది ఈ ఆలయంలోని స్వామి శాంత స్వరూపంతో దర్శనమిస్తాడు.

అహోబిలంలో చూడాల్సిన మరో ప్రదేశం ప్రహ్లాద బడి. ఒక చిన్న గుహనే "ప్రహ్లాద బడి" అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపైనుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాలాగా సహజసిద్ద కొండ ఉంటుంది, దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు. ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు.

అహోబిలంలో చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం "ఉగ్ర స్థంభం". ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్థంబం మాదిరిగా ఉంటుంది. దీనిని చేరుకోవడం కొంచెం కష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది. దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి. దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి. జ్వాలానరసింహ, భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి.

అహోబిలం ఎలా చేరుకోవాలంటే... అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం హైదరాబాదు, అక్కడనుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. నంద్యాల, కర్నూలు, హైదరాబాద్‌‌ల నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు-వైజాగ్‌ మార్గంలో, నంద్యాల రైల్వేస్టేషన్‌ ఉంది. ఈ ఆలయం హైదరాబాద్‌కు 363 కి.మీ, తిరుపతికి 262 కి.మీ, నంద్యాలకు 74 కి.మీ దూరంలో ఉంది. లక్ష్మీ నిలయం టూరిస్ట్‌ రెస్ట్‌హౌస్‌, తిరుమల తిరుపతి దేవస్థాన సత్రం, ఆర్యవైశ్య సత్రం దిగువ అహోబిలంలో యాత్రికుల బస నిమిత్తం అందుబాటులో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu